
జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: వారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు. చదువుతో పాటు ఎంచుకున్న ఖోఖో ఆటలో ఉత్తమ ప్రతిభ చాటుతున్నారు. ప్రత్యర్థి జట్టుపై గెలుపే లక్ష్యంగా ఆడుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన వీరిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. భారత జట్టుకు ఆడాలని..: గద్వాల మండలం ఈడిగానిపల్లి గ్రామం మాది. అయిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కల్వకుర్తి బీసీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో చదివాను. ప్రస్తుతం బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. పట్టుదలతో ఖోఖో ఆడతాను. పదిసార్లు రాష్ట్రస్థాయి, ఐదుసార్లు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాను. ఖేలో ఇండియా గేమ్స్‌లో కాంస్య పతకంతో మెరిశాను. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడటంతో పాటు ఐపీఎస్‌గా సేవలందిస్తా. ఏడుసార్లు రాష్ట్రస్థాయిలో..: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం ఓబులాపూర్‌ గ్రామం మాది. దామరగిద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ఐదేళ్లుగా ఖోఖో ఆడుతున్నా. గురుకుల మైదానంలో నిత్య సాధన చేస్తున్నా. పోటీలు ఎక్కడ నిర్వహించినా ముందుండి ఆడతా. ఏడుసార్లు రాష్ట్రస్థాయి, ఒకసారి జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. భారత జట్టుకు ఆడటమే నా లక్ష్యం. భవిష్యత్తులో రైల్వే ఉద్యోగం సాధిస్తా. ఉత్తమ అవార్డుతో మెరిసి..: మాది వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లి. కల్వకుర్తి బీసీ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. చిన్నప్పుడే ఖోఖోను ఎంచుకుని ప్రత్యేక శిక్షణతో పట్టు సాధించా. ఆటలో ప్రత్యర్థి జట్టు సభ్యులకు దొరకకుండా ఆడటంలో ముందుంటా. రాష్ట్ర ఉత్తమ డిఫెన్స్‌ అవార్డు సాధించా. ఎనిమిది సార్లు రాష్ట్రస్థాయి, రెండు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాను. ఐపీఎస్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. దేశానికి సేవ చేయడమే లక్ష్యం..: అయిజ మండలం సింధూనూర్‌ గ్రామం మాది. జడ్చర్లలో నిర్వహిస్తున్న నవాబ్‌పేట బీసీ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. చిన్ననాటి నుంచి ఖోఖో ఆడుతున్నా. రోజూ మైదానంలో శిక్షణ పొందుతున్నా. రెండుసార్లు రాష్ట్రస్థాయి, ఒకసారి జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నా. బీసీ గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఖోఖోలో మరింత రాణించి, ఆర్మీ అధికారిగా సేవలందిస్తా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





