
పూర్తి సమాచారంతో హెల్త్‌ కార్డులు ముండ్లదిన్నె ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు గద్వాల న్యూటౌన్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అవగాహనాలోపం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. విద్యార్థులకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం (హెల్త్‌ ప్రొఫైల్‌) వారి కార్డుల్లో ఉండాలనే జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాష షేక్‌ ఆదేశాల నేపథ్యంలో, వైద్యాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించగా, అతి త్వరలోనే వైద్య పరీక్షలు మొదలవనున్నాయి. ఎత్తు, బరువు, బీఎంఐ, రక్త నమూనా, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం, బ్లడ్‌ ప్రెషర్, పల్స్‌రేట్, కంటి, ఈఎన్‌టీ, గుండె, చర్మం, నాడి, ఊపిరితిత్తుల పరిస్థితి. 4డీలలో లోపాలు, వ్యాధులు, బాలికల రుతుస్రావం, దీర్ఘకాలిక ఆరోగ్య ట్రాకింగ్‌ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటి ఆధారంగా పిల్లలకు వారి పేరుతో హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు. దీంతో ఎప్పుడు విద్యార్థికి ఏ అనారోగ్యం వచ్చినా, వారి హెల్త్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 75 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్బీఎస్‌కే వైద్యుల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ బృందాలు ఆయా పాఠశాలలకు వెళ్లి ప్రతి విద్యార్థిని పరీక్షించి వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా మండలాల వారీగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. తరువాత హెల్త్‌ప్రొఫైల్‌ కార్డుల జారీ చేపడతారు. హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ నుంచి ఆదేశాలొచ్చాయి.. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే వైద్య పరీక్షలు ప్రారంభిస్తామని డీఎంహెచ్‌వో సంధ్యా కిరణ్మయి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




