
జిల్లా ప్రగతిపై దృష్టిపెట్టని జడ్పీ పాలకవర్గం మొక్కుబడి సమావేశాలకే పరిమితం కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో వ్యవసాయం, తాగునీరు, సాగునీటి శాఖలపై చర్చించనున్నారు. ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన 2021 సెప్టెంబరు 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 20 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. పాలకవర్గం పార్టీ అయిన వైకాపా 2021- 24 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినప్పటికీ జిల్లా అభివృద్ధిపై వీరు దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి. రెండు నెలలకోసారి స్థాయీ సంఘ సమావేశాలు, 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించారు. చివరగా ఈనెల 17వ తేదీన 20వ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ఈనెల 24వ తేదీ తేదీతో ముగియనుంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి ఛైర్మన్‌గా పాపిరెడ్డి కొనసాగారు. ఇకపై కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రత్యేక జడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు నంద్యాల జిల్లాలో కొత్తగా జడ్పీ కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. గురువారం నిర్వహించనున్న చివరి సమావేశంలో వ్యవసాయం, తాగు, సాగునీటిపై చర్చిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలో 75 శాతం పంటలు సాగవగా.. అధికశాతం పత్తి, మొక్కజొన్న, కంది వేశారు. నంద్యాల జిల్లాలో 60 శాతం పంటలు సాగయ్యాయి. మొక్కజొన్న, మినుము ఇతర పంటలు సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో కరవు మండలాలను ప్రకటించాలని రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఎల్లెల్సీ కాలువకు విడుదల చేసిన నీటితో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నింపడంతో పల్లె ప్రజల దాహార్తి కొంతవరకు తీరుతోంది. ఉమ్మడి జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు ముందుకు సాగడం లేదు. పెండింగ్‌ బిల్లులు విడుదలైతే పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకొచ్చే అవకాశముంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సీపీడబ్ల్యూఎస్‌ పథకాల నిర్వహణకు టెండర్ల ఆహ్వానించకపోవడంతో పాత గుత్తేదారులే కొనసాగుతున్నారు. దీంతో ఈ పథకాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఐదేళ్ల జడ్పీ పాలకవర్గ హయాంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాల్లో జిల్లా అభివృద్ధి, ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాల్లేవు. మొక్కుబడిగా కొన్ని తీర్మానాలు చేశారంతే. ఏటా వృథాగా దిగువకు వెళ్లిపోతున్న తుంగభద్ర జలాలను నిల్వ చేసుకునేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని, జల్‌జీవన్‌ మిషన్‌ పనులను గ్రామం యూనిట్‌గా చేయాలని, కర్నూలులో కేఆర్‌ఎంబీ కార్యాలయం ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని, గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని తీర్మానించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.