
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు చిన్నహ్యాట వద్ద కొండను తవ్వేసిన అక్రమార్కులు హొళగుంద మండలం.. నెరణికి గ్రామ సమీపంలోని కొండల్లో ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా వాహనాల్లో పెద్దఎత్తున రవాణా చేస్తున్నారు. అక్రమ సంపాదనకు తెరలేపారు. విషయం అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణం, హాలహర్వి, హొళగుంద హొళగుంద మండలం నెరణికి, ఆలూరు మండలం కురుకుంద గ్రామ సరిహద్దులోని సర్వే నంబరు 495లో 614 ఎకరాల ప్రభుత్వ భూమి (రాళ్ల గుట్ట) ఉంది. ఇందులో అక్రమార్కులు పొక్లెయిన్లు పెట్టి టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ప్రతిరోజూ వాహనాల్లో తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ మట్టిని పవన విద్యుత్తు సంస్థలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు పవన విద్యుత్తు యాజమాన్యంతో ఓ ధరకు ఒప్పందం చేసుకుని సరఫరా చేస్తున్నారు. కొండల్లోకి టిప్పర్లను తీసుకెళ్లి పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పొక్లెయిన్‌ సాయంతో టిప్పరులో మట్టి నింపుతూ.. ఆలూరు నుంచి హొళగుందకు వెళ్లే మార్గంలో ఇటు కురుకుంద - అటు నెరణికి గ్రామాల సరిహద్దుగా ఉన్న ఎర్రమట్టి కొండను తవ్వి మట్టిని విక్రయిస్తున్నారు. మట్టిని తరలించాలంటే ఆయా శాఖల అనుమతి తప్పనిసరి. కానీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. అంతేకాక మైనింగ్‌ అధికారుల వద్ద అనుమతుల కోసం దరఖాస్తు చేశామంటూ ఓ కాగితాన్ని అడ్డుగా పెట్టి అక్రమార్కులు తమపని కానిచ్చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కంపెనీ వారితో టిప్పరు మట్టి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాట్లాడుకొంటున్నారు. ఆ తర్వాత టిప్పర్‌ యజమానులతో మట్టి తరలించేందుకు ఒప్పందం చేసుకుని ఒక్కో టిప్పర్‌కు రూ.3 వేలు ధర చెల్లించి మట్టి రవాణా చేస్తున్నారు. ఎవరికి చెల్లించాల్సిన వాటాను వారికి చెల్లించి తమ అక్రమ సంపాదనకు అడ్డురాకుండా దందాకు పాల్పడుతున్నారు. ఇలా హొళగుంద మండలంలో నెరణికి, చిన్నహ్యాట కొండలను తవ్వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని జనం విన్నవిస్తున్నారు. ఈ విషయమై హొళగుంద తహసీల్దారు లక్ష్మీరాజును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మైనింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారని, మైనింగ్‌ అధికారుల నుంచి ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. అయినా చాలాచోట్ల మట్టిని తవ్వుతున్నారని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





