
KTR | హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీస్‌స్టేషన్‌లోనే సుమారు 15 మంది ముసుగులు ధరించి దాడికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. దాడి చేసింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చిన వారెవరో తేలాల్సి ఉందని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపైనా గతంలో దాడి జరిగిందని పేర్కొన్నారు. “ప్రాణాలకు లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైనే దాడి జరిగింది. ఆ దాడిని ఆపేందుకు మేము వెళ్తే మమ్మల్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అక్కడ కూడా మాపై దాడి చేయడానికి ప్రయత్నించారు” అని కేటీఆర్ అన్నారు. తాజా సైఫాబాద్ ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్‌రెడ్డిని విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి.. అక్కడే సుమారు 15 మంది ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడికి ప్రయత్నించారని తెలిపారు. “నిన్న పోలీస్‌స్టేషన్ లోపల నా పీఆర్వోను, నా పీఏను ఇద్దరినీ 15 మందితో దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది” అని అన్నారు. ఈ ఘటనలో ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరనే విషయాన్ని తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “నిన్న పోలీస్‌స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాలి” అని ఆయన అన్నారు. “మా వారిపై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయలేదు. మా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అక్కడ ఐదు గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు నమోదు చేయలేదు” అని ఆయన అన్నారు. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గుండాలు పోలీస్‌స్టేషన్‌లో దాడులకు పాల్పడిన వారికి మద్దతుగా నిలుస్తూ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. “ ఈ అంశంలో కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.