
కొండా సురేఖది తనది ఒకే మాట అని.. తమ కూతురిది వేరే మాట అని కొండా మురళీ అన్నారు. తమ కూతురు ప్లాన్ బీ ఏంటో తనకు తెలియదని, తమ బిడ్డకు తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. మాటపై నిలబడటం ముఖ్యమని, పదవులు ఉంటాయ్.. పోతాయన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్పష్టం చేశారు. అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటుందని, పార్టీ మారతామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖతో సారీ చెప్పించాలని తాను కోరినట్లు కొండా మురళీ వెల్లడించారు. కనీసం పేపర్‌పై రాసి ఇవ్వాలని కూడా ఆమెను బ్రతిమిలాడానని, అయితే సురేఖ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. పదవి పోయినా ఆమె భయపడలేదన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేవరకు పోరాడతామని కొండా మురళీ అన్నారు. తమ గెలుపు కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తాము ఎలా వీడుతామని ప్రశ్నించారు.‘మేము కాంగ్రెస్ పార్టీని వీడబోము’ అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారతామంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
కృతజ్ఞత అనేది తమ రక్తంలోనే ఉందని కొండా మురళీ అన్నారు. నమ్మితే నమ్మకంగా ఉంటామని, లేదంటే ఉండమని వ్యాఖ్యానించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన ఇచ్చిన మంత్రి పదవి వద్దని, పావురాలగుట్టలో రాజీనామా పత్రం పడేసి వచ్చామని ఆయన గుర్తు చేసుకున్నారు.తాను ఎక్కడైనా భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొండా మురళీ సవాల్ చేశారు. తమపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని అన్నారు.ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం పిలిచినా కొండా సురేఖ వెళ్లడం లేదని ఆయన తెలిపారు. తమకు పదవుల కంటే నమ్మకం, కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు.
కార్యకర్తలే తన బలం, బలహీనత అని కొండా మురళీ అన్నారు. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు.తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు.





