
ఖమ్మం: అర్హులైన ప్రతిఒక్క ఓటరు తుది జాబితాలో స్థానం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సవరించిన షెడ్యూల్, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియపై ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు వ్యవధి ఆగస్టు 17 నుంచి నుండి అక్టోబర్ 7 వరకు ఉందన్నారు. నోటీసుల డిస్పోజల్, అపీళ్ల పరిష్కారానికి నవంబర్ 5 వరకు గడువు ఉండి, తుది ఓటరు జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నట్లు తెలిపారు. నూతనంగా ఓటరు నమోదు కోసం ఫారమ్ 6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ కాపీని తప్పనిసరిగా జతచేయాలని కలెక్టర్ తెలిపారు. ఫిజికల్ హియరింగ్ సమయంలో దరఖాస్తుదారులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరుకావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,75,841 నోటీసులకు గాను ఇప్పటివరకు 1,60,623 నోటీసుల పంపిణీ చేసి, 91.34 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. ఇప్పటివరకు 81,446 మందికి విచారణ పూర్తి చేసి, దరఖాస్తులను దరఖాస్తులు పరిష్కరించామన్నారు. నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొని సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డీసీ సదానందం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసుమర్తి శ్రీనివాస్, బీఎస్పీ ప్రతినిధి వేల్పుల రామయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బి. వేణుగోపాల్, భాజపా పార్టీ ప్రతినిధి వి.రాజేశ్‌, సీపీఐ (ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాశ్‌, ఐఎన్‌సీ పార్టీ ప్రతినిధి అన్నెం గోపాల్ రావు, తెదేపా పార్టీ ప్రతినిధి పాలడుగు టీఆర్ కృష్ణప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.