
Khairatabad DCP | సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడి తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి కేటీఆర్ సిబ్బందిపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టగా.. అసలు ఎలాంటి దాడి జరగలేదని సైఫాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని, దాడికి సంబంధించిన ఎలాంటి ఘటన కనిపించలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద జరిగిన వివాదానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగానే కేటీఆర్ పీఏ, పీఆర్వోలను సోమవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిచామని తెలిపారు. అదే సమయంలో స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గణేశ్ మండపం వద్ద డీజేకు అనుమతి కోసం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారని వివరించారు. డీజే పర్మిషన్ విషయమై సైఫాబాద్ సీఐతో వారు మాట్లాడుతుండగా.. వారిలో ఒకరు కేటీఆర్ పీఆర్వో మహేశ్‌ను గుర్తించారని తెలిపారు. అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వారిని మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారా అంటూ ఆ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడని డీసీపీ చెప్పారు. అలా మాట్లాడొద్దని సీఐ వారించడంతో యువకులు పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారని వివరించారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పరిణామాలపై సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిలపై ఎలాంటి దాడి జరగలేదని వివరణ ఇచ్చారు పోలీసుల వివరణపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘డీజే పర్మిషన్ కోసం వచ్చిన వాళ్లు సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోతో ర్యాష్‌గా మాట్లాడి గొడవ చేసినా.. వారిని ఏమీ అనకుండా ఎస్ఐ బయటికి పంపించారా’’ అని సందేహంగా ప్రశ్నించారు. మేడం చెప్పేది చిన్న పోరడు కూడా నమ్మేలా లేదని.. కొత్తగా ట్రై చేయాలని సూచించారు. డీజే పర్మిషన్ కోసం వచ్చిన వారు ముఖాలకు మాస్క్‌లు ఎందుకు వేసుకుంటారు.. వినడానికి విచిత్రంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డీజే పర్మిషన్ అడగాలంటే మాస్క్ వేసుకుని వెళ్లాలా అని ప్రశ్నించారు. ఎదవ స్క్ట్రిప్ట్ రాజాసాబ్ కంటే వరస్ట్‌గా ఉందని కామెంట్స్ పెట్టారు. మంచి కథల పోటీల్లో ప్రాక్టీస్ చేయాలని పలువురు సూచించారు.