
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీవ్ర అలజడి రేపిన నటి కాదంబరి జెత్వానీ కేసు వివాదంలో సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం అందించింది. సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ఉన్న సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా జీవోలు జారీ చేసింది. వీరిద్దరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు నమోదు, విచారణ క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలతో 2024 సెప్టెంబర్లో కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తాజా జీవో జారీ కావడంతో ఇద్దరికీ పెద్ద ఊరట లభించినట్టయింది.