
కన్నడ నటుణ్ని వరించిన అత్యున్నత సినీ పురస్కారం ఈనాడు సినిమా విభాగం: ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ను అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే వరించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి ఆయనకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అనంత్‌ నాగ్‌ ఐదు దశాబ్దాలుగా కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ తదితర భాషల్లో 300కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. థియేటర్‌ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ‘సంకల్ప’ చిత్రంతో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ప్రారంభంలోనే దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన ‘అంకుర్‌’, ‘నిశాంత్‌’, ‘భూమిక’, ‘కొండూర’ లాంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆర్కే నారాయణ్‌ కథల ఆధారంగా రూపొందిన ‘మాల్గుడి డేస్‌’ టెలీ సీరియల్‌లో మిఠాయివాలా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ‘పద్మభూషణ్‌’ గౌరవాన్ని అందుకున్నారు. అనంత్‌నాగ్‌కు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





