
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (56) అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఆళ్ల నాని హఠాన్మరణం చెందారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలో గుండెపోటుకు గురైన ఆళ్ల నానిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, గత వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.