
తహసీల్దార్‌.. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు నిషేధిత జాబితాలో భూముల వివరాలపై అధికారుల స్పష్టత ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో నిషేధిత జాబితాలో భూములు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లున్నాయన్న ప్రచారాలకు స్పష్టత ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్టా భూములు, ఇళ్ల యజమానులు, లే-అవుట్లు కొనుగోలు చేసినవారిలో ఎవరైనా సరే... నిషేధిత జాబితాలో వారి ఆస్తులున్నాయన్న అనుమానం వచ్చినా... ఆధారాలున్నా సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. నిషేధిత భూముల జాబితాలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లున్నాయన్న ప్రచారం మూడు జిల్లాల్లో వివాదాస్పదంగా మారింది.ఆందోళనకు ప్రధానకారణాలు న్యాయ వివాదాలు, కంప్యూటరీకరణలో దొర్లిన పొరపాట్లేనని రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తించారు. మూడు జిల్లాల్లో తమ భూములను నిషేధిత జాబితాలో ఉంచారంటూ 7500 పిటిషన్లు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల పక్కనే బై నంబర్లున్నాయని అధికారులు చెబుతుండగా.. ప్రైవేటు భూములంటూ యజమానులు కోర్టులను ఆశ్రయించారు. గతేడాది డిసెంబరులో కలెక్టర్లు నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వానికి పంపించేటప్పుడు ఏ,బీ,సీ,డీ,ఈ పేర్లతో వర్గీకరించారు. వర్గీకరణలో భాగంగా కంప్యూటరీకరించేటప్పుడు ఆ సర్వే నంబర్ల తాజా పరిస్థితులను పరిశీలించకుండా రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్‌లోని వివరాలను పంపించారు. మూడు జిల్లాల్లో పట్టణ భూగరిష్ఠ పరిమితి మినహాయింపు ఉన్న భూములకు సంబంధించిన దరఖాస్తులు రెండు, మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 20 రోజుల క్రితం పరిష్కరించారు. శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, అల్వాల్, మేడిపల్లి మండలాల పరిధుల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో వీటిపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకరిద్దరు ఇళ్లు విక్రయించేందుకు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లగా నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పారు.తాజాగా రెండు జిల్లాల్లో యూ ఎల్‌సీ మినహాయింపున్న భూములు విక్రయించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో టీఎస్‌ నంబర్లు, సర్వే నంబర్లను సరిపోల్చగా ఇంకా ఇబ్బందులు ఉండడంతో వారంలో పరిష్కరించాలని నిర్ణయించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




