
వర్షాకాలం ఇంకా ముగియలేదు.. వానలు ఇప్పటికీ జాడలేవు.. సర్కార్‌కు పట్టింపు లేదు. కాలువలు అసలే పారవు.. బావులు, బోర్ల నుంచి పంటలకు నీళ్లు పెడుదామంటే కరెంటు దిక్కులేదు.. కాంగ్రెస్ పాలనలో కర్షకుల వెతలకు అంతులేదు.. మళ్లీ పాతరోజులు దాపురించి అరిగోస పడుతున్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటల పాటు వచ్చిన వ్యవసాయ విద్యుత్తుతో రైతు గుండె భరోసాతో నిండగా నేడు రోజులో గంటలకుగంటలు కరెంటు కోతలతో అన్నదాతలకు గుండెకోత తప్పడం లేదు. నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్, (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి రైతు నోటా వస్తున్న మాటలివి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామన్న సీఎం, మంత్రుల ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులే స్పష్టంచేస్తున్నాయి. బోర్లు, బావుల్లో నీరున్నా విద్యుత్తు సమస్యతో రైతులు సతమతం అవుతున్నారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి కావాల్సిన అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఇతర విద్యుత్తు సామగ్రి అందుబాటులో లేనేలేదు. అదనపు ట్రాన్స్ఫార్మర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఫలితంగా రైతుల మోటర్లు కాలిపోతున్నాయి. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమ కండ్ల ముందే పంటపొలాలు ఎండుతుంటే అన్నదాతలు బావురుమంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం లేదా 10 రోజుల్లో పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సమస్యలపై నమస్తే తెలంగాణ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల రైతులు సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగారు. వ్యవసాయానికి నిత్యం 18-20 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. కానీ ఇటీవల నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఎదుటే ట్రాన్స్‌కో ఎస్ఈ మాట్లాడుతూ 14-16 గంటల కరెంటును సరఫరా చేస్తున్నట్టు తేల్చి చెప్పడం గమనార్హం. ఇదే సమీక్షలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్తు సామగ్రి కొరత విషయాన్ని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి ఎన్నిసార్లు తెచ్చినా ఫలితం రావేడం లేదని ప్రజాప్రతినిధులు వాపోయారు. చాలాచోట్ల కనీసం 10 గంటలు కూడా కరెంటు సరఫరా కావట్లేదని తేలింది. కొన్నిచోట్ల 8 నుంచి 10 గంటలు మరికొన్ని చోట్ల 10-12 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతున్నట్టు స్పష్టమైంది. దీనికి తోడు లోవోల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. వాస్తవంగా వ్యవసాయ మోటర్లకు 440 ఓల్ట్స్ సామర్థ్యంతో కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా, 350 ఓల్ట్స్కి మంచి సరఫరా కావడం లేదు. దీంతో మోటర్లు కాలిపోతున్నాయని రైతుల వాపోతున్నారు. గృహోపయోగ కరెంటు సైతం 230 ఓల్ట్స్ సామర్థ్యంతో సరఫరా చేయాల్సి ఉండగా, 200కి మించి రావడం లేదని తేలింది. దీంతో కరెంటుపై ఆధారపడి సాగించి చిరు వ్యాపారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు పదేపదే ట్రిప్ అవుతున్నట్టు తెలిసింది. ఈసారి వర్షాభావంతో రైతులు ఎక్కువగా బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా అధిక లోడ్ పడుతున్నట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 2.45 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఉదయం 5 లేదా 6 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6గంటల వరకే త్రీఫేజ్ కరెంటు సరఫరా చేస్తున్నారు. దీంతో సగటున 10 గంటలకు మించి కరెంటు సరఫరా కావడం లేదు. ఆ తర్వాత టూ ఫేజ్ లేదా సింగిల్ ఫేజ్ కరెంటునే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎండిపోతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరెంటు ఇవ్వలేమని ముందే ప్రభుత్వ ప్రకటించి ఉంటే తాము అంతవరకే పంటలు వేసేవాళ్లం కదా అని వాపోతున్నారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి సబ్స్టేషన్లలో నిర్వహించే లాగ్‌బుక్స్‌ను పూర్తిగా రహస్యం చేశారు. కొన్నిచోట్ల వాటిని ఎవరికీ కనపడకుండా చేస్తుండగా, మరికొన్ని చోట్ల వాటిల్లో రాయడమే మానేశారు. కేవలం సెల్ఫోన్లలోనే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ రాత రికార్డులను పక్కన పెట్టేశారు. ఇదేమిటని అడిగితే పైఅధికారులే లాగ్‌బుక్స్‌లో రాయొద్దు.. రాసిన వాటిని ఇతరులకు చూపొ ద్దు.. అని స్ట్రిక్ట్‌గా ఆదేశాలిచ్చినట్టు సిబ్బంది చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే మొత్తం 4,01,851 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలో 1,03,500, జగిత్యాల 1,41,000, రాజన్న సిరిసిల్ల 82,093, పెద్దపల్లి జిల్లాలో 75,258 చొప్పున ఉన్నాయి. ఇటీవల పడిన వర్షాలకు, ఆయకట్టు ప్రాంతాల్లో వ్యవసాయ బావుల్లో నీళ్లు వచ్చి చేరాయి. కానీ, విద్యుత్తు సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు ఉన్న నీటిని కూడా పంటలకు అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఇచ్చే 10 గంటల విద్యుత్తు సరిపోక, పంటలకు నీళ్లు పెట్టలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం, పదిరోజుల్లో పంటలు ఎండిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు లో వోల్టేజీతో నెలకు ఒకటి, రెండుసార్లు మోటర్లు కాలిపోతున్నాయని చెప్తున్నారు. ఈ మరమ్మతులు అదనపు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజూ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అధికారులే చెప్తున్నారు. రోజుకు 12 గంటలే అన్నమాట. ఆ ఇచ్చే కరెంటు కూడా నాణ్యతగా ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 13: పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని రైతులు మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ ఉండక.. చేతికందాల్సిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరం కూడా లేకుండా పోయిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బోరు, బావుల కిందనైనా పంటలు సాగుచేసుకుందామనుకుంటే సరైన కరెంటు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని వాపోతున్నారు. కీలక సమయంలో కరెంటు కోతలు విధించడాన్ని నిరసిస్తూ ఆదివారం కూడా రైతులు పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు సబ్ స్టేషన్‌ను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ముట్టడించారు. అనంతరం అక్కడే కాకరవాయి-ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. బచ్చోడు సబ్‌స్టేషన్ పరిధిలో అప్రకటిత విద్యుత్తు కోతలు విధించడం వల్ల సాగులో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తామన్న చెప్పిన ఎన్నికల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు బోర్లు, బావుల్లో ఉన్న కొదిపాటి నీళ్లనైనా పంటలకు అందించుకుందామనుకుంటే కరెంట్ కోతలతో తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు. ఈ ఆందోళనలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడే వంటా -వార్పు నిర్వహించడానికి యత్నించగా, పోలీసులు జోక్యం చేసుకొని విరమింపజేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. ఎల్సీల పేరుతో, లోవోల్టేజీతో గం టల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నది. రోజుకు 5 గంటల నుం చి 6 గంటలు కూడా సక్రమంగా కరెంట్ అందడం లేదు. ఆ కొద్దిపాటి కరెంట్‌తో పొలాలకు నీరు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే వరి పొలాలు ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా చేయాలి





