
ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందుపై (BRICS Veg Menu Row) సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గొయెంకా స్పందించారు. శనివారం జరిగిన విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్స్‌ వేదికగా భారత్‌లో 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని.. భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని పేర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సులో కేవలం శాఖాహార వంటలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ఈ అంశంపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాఖాహార వంటలు భారత్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే వాటిని మనం ఎందుకు ప్రదర్శించకూడదని ప్రశ్నించారు. అక్కడ వడ్డించిన వంటకాల వైవిధ్యాన్ని ప్రస్తావించారు. ఇది సాధారణ శాఖాహార మెనూ కాదని గుజరాత్ నుంచి ఖాండ్వి, అవధ్ నుంచి మష్రూమ్ గలౌటీ, కాశ్మీర్ నుంచి గుచ్చి, దక్షిణాది నుంచి పోరియల్, పాత దిల్లీకి చెందిన ఫ్రూట్ క్రీమ్, జిలేబీ... వంటి ఎంతో అద్భుతమైన వంటకాలను చేర్చారని పేర్కొన్నారు. ఈ విందులో పాల్గొనే అవకాశం వస్తే ఎంత బాగుండేదో అని హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. బ్రిక్స్‌లో ప్రధాన వంటకాలలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రుచులకు చోటు లభించింది. వీటిలో పనీర్ లబాబ్‌దార్, హిమాలయన్ మోరెల్ పుట్టగొడుగులు, ఆస్పరాగస్‌తో చేసిన గుచ్చి మార్మిక్, అలాగే క్యారెట్-బీన్స్ పొరియల్, తేలికపాటి పప్పు చారు, చిరుధాన్యాల పులావ్, బీట్‌రూట్ రైతా, వివిధ రకాల భారతీయ రొట్టెలు ఉన్నాయి. చివరగా అతిథులకు డెజర్ట్‌గా జిలేబితో కూడిన ఓల్డ్ దిల్లీ ఫ్రూట్ క్రీమ్, ‘షహతూత్ ఫిర్నీ’ వడ్డించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





