
22ఏ సమస్యపై కమిటీల పేరిట కాలయాపనా? మీ ఇల్లు అయితే నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగిస్తారా? ప్రజల ఇళ్లను తొలగించడానికి అడ్డమేంటి.. మీ అక్రమాలను ప్రశ్నిస్తున్నామనే... కేసీఆర్‌పై, నాపై, మా కుటుంబ సభ్యులపై ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో జగదీశ్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి 22ఏ సమస్య పరిష్కారంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ప్రజలు ఆశించారని, కానీ కేవలం కమిటీల పేరిట కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ధరణి, భూభారతి... 22ఏ వ్యవహారంపై భారాస ప్రభుత్వ హయాం నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలుపై భారాస ప్రశ్నిస్తుంటే... ముఖ్యమంత్రి దృష్టి మళ్లింపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించడానికి కమిటీలు వేస్తాం.. మార్గదర్శకాలు ఇస్తామని చెబుతున్నారే తప్ప స్పష్టమైన పరిష్కారం చూపలేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ దాటవేత ధోరణి. ముఖ్యమంత్రి ఇల్లు రాత్రికి రాత్రి నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారో.. అదేవిధంగా ప్రజల ఆస్తులను కూడా 22ఏ నుంచి తొలగించడానికి మీకొచ్చిన అడ్డంకి ఏమిటి? చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒకటే ఉండాలి. మీ ప్రభుత్వం చేస్తున్న భూ అక్రమాలను ప్రశ్నిస్తున్నామనే కక్షతో... దురుద్దేశపూరితంగా కేసీఆర్‌పై, నాపై, మా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు. 2023 డిసెంబరు 7 నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారు? ఎన్ని తొలగించారు? అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి లేదా భూభారతి.. 22ఏ జాబితా వ్యవహారంపై భారాస పాలన నుంచి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినవన్నీ అర్ధసత్యాలు, అబద్ధాలు. రాహుల్‌గాంధీ లోక్‌సభకు టీషర్ట్, స్టిక్కర్లు వేసుకుని వెళ్తే ఒప్పు.. భారాస ఎమ్మెల్యేలు టీ షర్ట్‌ వేసుకుని వస్తే తప్పా? లోక్‌సభ, అసెంబ్లీ నియమాలు వేర్వేరా? పక్కా పథకం ప్రకారం మమ్మల్ని అసెంబ్లీ నుంచి గెంటేశారు. మా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో అనుచితంగా ప్రవర్తిస్తే.. కనీసం మైక్‌ ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్‌ చేశారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో భారాస చేసిన ఆరోపణలు అక్షర సత్యమని సీఎం అసెంబ్లీలో ఒప్పుకొన్నారు. 3.71 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెడితే.. అది 30 లక్షల ఎకరాలకు పెరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు. దీనివల్ల ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో సమాధానం చెప్పాలి? కలెక్టర్లు దబా.. దబా సంతకాలు పెట్టి అప్‌లోడ్‌ చేశారని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని సీఎం స్వయంగా అంగీకరించారు. మరోవైపు కాంగ్రెస్‌ వచ్చాక ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందులో ఎవరిది నిజం? అధికారులే 30 లక్షల ఎకరాలు అప్‌లోడ్‌ చేశారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి కారణం మీరే కదా? భూభారతిలో 9,200కు పైగా భూముల రిజిస్ట్రేషన్లు యజమానులకు తెలియకుండానే జరిగిపోయాయి. ఇంత పెద్ద స్కామ్‌పై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? నాదర్‌గుల్‌లో రూ.10 వేల కోట్ల భూ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బయటపెడితే... ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేదు? ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన కంపెనీకి కోట్ల విలువైన భూ కేటాయింపు, పసుమాములలో మరో సోదరుడి భూమి నాలా కన్వర్షన్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? నాకున్న వ్యవసాయ భూమి వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌లో స్పష్టంగా ఉన్నాయి. నా భూమిని సర్వే చేసిన అధికారులే రెండు గుంటలు తక్కువ ఉందని తేల్చారు. మా సోదరుడు అమెరికాలో 30 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 2010 నుంచి పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నారు. చట్టబద్ధంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి ఒక్క కొట్రా గ్రామంలోనే 308 ఎకరాల ఆస్తులు ఉన్నట్లు గంట వ్యవధిలోనే మాకు సమాచారం అందింది. ఇందులో 175 ఎకరాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. దీనికితోడు కొండారెడ్డిపల్లిలో 77 ఎకరాలు! ఈ ఆస్తులు రేవంత్‌ కుటుంబం పేరిట ఉన్న మాట వాస్తవం కాదా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పొంగులేటిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఈ నెల 12న శాసనసభలో తమపై మంత్రి పొంగులేటి తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ... మంత్రిపై హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





