
Harish Rao | మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. పండగ రోజున విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రప్పించి, సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారని తెలిపారు. ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీం దాడిని గమనించి కేకలు వేస్తూ అడ్డుకోవడంతో, ముసుగులు ధరించిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వమే పోలీస్ స్టేషన్‌కు ముసుగులు ధరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించి దాడికి యత్నించడం అత్యంత దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లోనే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే దాడులు చేస్తారా అని నిలదీశారు.ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని సైతం లెక్కచేయకుండా ఈ దాడి యత్నం చేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని స్పష్టం చేశారు. హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలన్నారు. ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌నే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.