
పూలు అల్లుకుంటూ మీనా హాల్లో ఉంటుంది. ఇంకా బాలు రాలేదా అమ్మా అని సత్యం అడుగుతాడు. లేదు మామయ్య అని మీనా అంటుంది. ఇక సత్యం వెళ్లిన వెంటనే బాలు తూగుతూ ఇంటికి వస్తాడు. తాగి వచ్చారా? అని అడుగుతుంది మీనా. నేను కావాలని తాగలేదు అని బాలు అంటే.. మీకు తాగడానికి ఇంకో కారణం దొరికింది అంతే కదా అని మీనా అంటుంది. లేదు.. కావాలనే ఊదమన్నాడు.. నా బేరం చెడగొట్టాడు.. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్.. అతని మీద కోపంతోనే తాగాను అని బాలు అంటాడు. అది అతని డ్యూటీ.. అతని డ్యూటీ అతను చేస్తే మీకు వచ్చిన బాధ ఏంటి? దానికే మీరు తాగి రావాలా? అని మీనా తిడుతుంది. నువ్వేంటి.. అతడ్ని వెనకేసుకుని వస్తున్నావ్.. నా భార్యగానే నాకే సపోర్ట్ చేయాలి అని బాలు అంటాడు. తప్పు చేసిన వాళ్లని నేను సపోర్ట్ చేయను అని మీనా అంటుంది. డబ్బులు సంపాదిస్తున్నా అని పొగరు కదా.. నేను కూడా సంపాదిస్తున్నా.. ఇదిగో యాభై వేలు అని ఇస్తాడు బాలు. నాకు మీలాంటి తాగుబోతులు ఇచ్చే డబ్బు అవసరం లేదు అని మీనా అంటుంది. నేను తాగుబోతులతో మాట్లాడను అని మీనా అంటే.. నేను మాట్లాడతాను.. నాతోనే నేను మాట్లాడుకుంటా.. ఏంట్రా బాలు నీ భార్య ఓవర్ చేస్తోంది.. మూడు పెగ్గులు వేసుకుని ఇంటికి వస్తే మూడంతా పాడు చేస్తోంది.. మరి తాగడం కోసం పెళ్లాం పుస్తెలు కూడా అమ్ముకునే దరిద్రులు ఉంటారు కదా.. వాళ్లని ఏం అనాలి.. ఛ.. అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాలు. అన్నం అని మీనా అంటే.. నీకో దండం నాకేం వద్దు అని బాలు అంటాడు. తినకుండా పడుకోవడంతో మీనా మరింతగా బాధపడుతుంది. ఏంటి.. రమ్మని పిలిచావ్ అని అరుణ్ అడుగుతాడు. తన అక్కకు వచ్చిన ప్రాబ్లం గురించి సుమతి చెబుతుంది. రెండు లక్షలు సెట్ అయ్యాయి.. ఇంకా మూడు లక్షలు కావాలని సుమతి చెబుతుంది. నేను వేరే వాళ్ల దగ్గర తీసుకుంటే.. అది లంచం అంటారు.. అందుకే నేనే ఆ డబ్బులు ఇస్తా.. మీ అక్కకు అమౌంట్ వచ్చాక.. తిరిగి ఇవ్వమను.. బయట అయితే వడ్డీ ఉంటుంది.. నేను అయితే వడ్డీ తీసుకోను కదా అని అరుణ్ అంటాడు. సరే అని సుమతి ఒప్పుకుంటుంది. బ్యాంక్‌కి వెళ్లి అమౌంట్ తీసుకుని వస్తా అని అరుణ్ వెళ్లిపోతాడు. మీనా.. తల పోటు ఎక్కువగా ఉంది.. కాఫీ.. అని అరుస్తుంటాడు బాలు. ఇక ప్లాస్కులో పట్టుకుని వచ్చి అక్కడ పెడుతుంది మీనా. బారులో పోసుకుని తాగినట్టు ఇక్కడ కూడా పోసుకుని తాగండి అని కౌంటర్ వేస్తుంది మీనా. దీంతో బాలు కోపంగా చూస్తాడు.. ఏంటి.. అని మీనా కూడా తిరిగి చూస్తుంది. ఇంతలో రవి, శ్రుతి కూడా కిందకు వస్తారు. మీనా పెట్టిన కాఫీ.. అస్సలు మిస్ అవ్వొద్దు అని శ్రుతి తీసుకుని తాగుతుంది. కాఫీ అద్భుతంగా ఉంది మీనా అని పొగిడేస్తుంది శ్రుతి. రాత్రి ఏమో మాటలు వినిపించాయి. ఏం జరిగింది వదిన అని రవి అడుగుతాడు. ఏం లేదు.. మీ వదినకు నిద్ర రాకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అని బాలు అంటాడు. కబుర్లు చెప్పకండి.. జరిగింది చెప్పండని మీనా అంటుంది. రాత్రి బాలు అన్నయ్య తాగి వచ్చాడా? అని రవి అడుగుతాడు. అవును అని మీనా అంటుంది. నేనేం కావాలని తాగలేదు అని బాలు అంటాడు. అతనెవరి మీద కోపంతోనో తాగి వచ్చాడంట అని మీనా చెప్తుంది. తాగిన తర్వాత మాట్లాడినా వాగినట్టే ఉంటుంది.. అవసరమా తాగడం అని రవి అంటాడు. అయినా నువ్వు తాగడం మానేశావ్ కదా అని బాలుని రవి అడుగుతాడు. తాగుబోతులు అలానే చెప్తారు రవి.. ఏ చిన్న కారణం దొరికినా మళ్లీ తాగడం స్టార్ట్ చేస్తారు అని అంటుంది మీనా. నువ్వు మీనాని ఎందుకు బాధ పెడుతున్నావ్ బాలు.. నువ్వు ఏం చేసినా కూడా కూడా మీనాకి కూడా అందులో సగం వస్తుంది.. మీనాని ఎందుకు బాధ పెడుతున్నావ్ అని అడుగుతుంది శ్రుతి. మీనా మంచిది.. ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అని శ్రుతి అంటుంది. నేను కావాలని తాగలేదు.. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్లే తాగాను అని బాలు అంటాడు. అది వాళ్ల డ్యూటీ.. అయినా నువ్వు మళ్లీ మొదటికే వస్తున్నావ్.. ఇక నీతో వాదించే ఓపిక నాకు కూడా లేదు అని అంటాడు రవి. నాకు పని ఉంది నేను వెళ్తాను అని రవి అంటాడు. రేయ్ ఇప్పుడేనా? ఇంకాసేపు ఉండు రా అని బాలు అంటాడు. అయినా నువ్వేంటి నలుగురిలో నన్ను అవమానిస్తున్నావా? అని బాలు అంటాడు. నలుగురు ఎక్కడున్నారు.. ఉన్నది ఇద్దరే కదా.. ఇంకా తాగింది దిగలేదా?.. ఇంకా మైకంలోనే ఉన్నారా? అని మీనా కౌంటర్లు వేస్తుంది. మన ఇద్దరితో కలిపే అన్నాను.. అని బాలు అంటాడు. ఇక ఇంతలో మీనాకి సుమతి నుంచి ఫోన్ వస్తుంది. నేను బయటకు వెళ్లి వస్తాను శ్రుతి అని మీనా చెప్పి వెళ్తుంది. మేం కూడా వెళ్తాం అని రవి, శ్రుతి వెళ్లిపోతారు. ఇక్కడ చెట్టంత మనిషిని, భర్తని ఉన్నాను నాకు మాత్రం చెప్పలేదు అని బాలు అనుకుంటాడు. ముందు ఈ కాఫీని మనం తాగాలి.. అని ఆ ఫ్లాస్కుని మందు బాటిల్లా ఓపెన్ చేయాలని చూస్తాడు.. రేయ్ బాలు ఇది నువ్వు అనుకునే ప్లేస్ కాదు.. ఇది మందు బాటిల్ కాదు.. ప్లాస్క్ అని అనుకుంటాడు బాలు.