
బాలుకి ఓ వింత ఫ్యామీలి దొరుకుతుంది. గుడికి వెళ్లాలి.. తాగావా? చుక్క, ముక్క ముట్టుకున్నావా? అని అడుగుతుంది. లేదు అని అంటాడు బాలు. అలా తన కారులో ఎక్కించుకుని బాలు వస్తుంటాడు. మధ్యలో అరుణ్ ఆపుతాడు. బ్రీత్ అనలైజర్ పెట్టమని, ఊదమని అంటాడు అరుణ్. నేను తాగలేదు.. ఎందుకు ఊదాలి అని అంటాడు బాలు. ఇతను తాగి డ్రైవ్ చేస్తుంటాడు.. మీరు వేరే కారుని చూసుకుని వెళ్లండి అని ఆ కస్టమర్‌కి అరుణ్ చెప్తాడు. దీంతో వారు కారు దిగి వెళ్లిపోతారు. నేను తాగలేదు అని చెప్తున్నా.. నా గురించి బ్యాడ్‌గా చెప్పి.. నా గిరాకీని వెళ్లిపోయేలా చేస్తారా? అని బాలు అంటాడు. నువ్వు తాగినా తాగకపోయినా మేం టెస్ట్ చేయడం మా డ్యూటీ.. ఊద మన్నప్పుడు ఊదేసి వెళ్లిపోతే అయిపోతుంది కదా బాబు అని ఇంకో ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడు.. ఇలా మర్యాదగా అడిగితే ఊదుతాను అని బాలు ఊదేస్తాడు. ఏం రాలేదు సార్ అని అంటాడు ఆ కానిస్టేబుల్. అయితే పంపించేయండని అరుణ్ అంటాడు. ఏంటి పంపించేది.. నా బేరం పోగొట్టావ్.. నన్ను అవమానించావ్.. క్షోభ పెట్టావ్.. మరి ఈ నష్ట పరిహారం గురించి చెప్పరా? అని బాలు అంటాడు. గొడవ చేయకుండా వెళ్లిపో అని అంటాడు అరుణ్. దీంతో రాజేష్‌కి కోపంగా ఫోన్ చేసి బారుకి రమ్మంటాడు బాలు. ఏమైందే.. ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది తల్లి. ఏం లేదు అమ్మా.. మంచి ఓ పెద్ద ఆర్డర్ వచ్చిందని మీనా చెప్తుంది. అయితే సంతోషంగా ఉండాలి కానీ.. ఇలా డల్‌గా ఎందుకు ఉన్నావే అని రివర్స్‌లో ప్రశ్నిస్తుంది. కానీ ఐదు లక్షలు డిపాజిట్ కట్టాలని మీనా చెప్తుంది. ఆ మాటలతో షాక్ అవుతుంది అమ్మ. మనలాంటి వాళ్లకి ఐదు లక్షలు కావాలంటే.. ఐదారేళ్లు పడుతుంది కదా అని అంటుంది. అందుకే ప్రయత్నిస్తున్నా.. ఎక్కడా దొరకడం లేదు అని మీనా అంటుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్.. అని అమ్మ అడుగుతుంది. అప్పుడే వచ్చిన సుమతి కూడా మీనా సమస్యను తెలుసుకుంటుంది. నీ దగ్గర ఎంత ఉందక్కా అని సుమతి అడుగుతుంది. చిట్టీలు, బ్యాంకులో ఉన్నది అంతా కలిపితే లక్షన్నర అవుతుంది అని మీనా చెబుతుంది. అంటే ఇంకో మూడున్నర లక్షలు అంతే కదా.. ఆ డబ్బు నేను ఇస్తాను అని సుమతి అంటుంది. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని మీనా అడుగుతుంది. నా పెళ్లి కోసమని అప్పుడు కొంత ఇప్పుడు కొంత దాచి పెట్టుకున్నా కదా.. అదే మూడు, నాలుగు లక్షల దాక ఉంటుందని సుమతి చెబుతుంది. నీ దగ్గర డబ్బు తీసుకోలేను.. అది నువ్వు నీ పెళ్లి కోసం కష్టపడి సంపాదించి దాచి పెట్టుకున్నావ్ అని మీనా అంటుంది. అలా అంటావ్ ఏంటక్కా.. నా డబ్బు నీ డబ్బు కాదా.. నా కోసం నువ్వు, బావ ఉన్నారు కదా.. అని సుమతి అంటుంది. నీ డబ్బుని నేను వాడుకోలేను.. నా మనస్సాక్షి ఒప్పుకోదు అని అంటుంది మీనా. తీసుకోవే.. మళ్లీ నీ ఆర్డర్ పూర్తయ్యాక డబ్బులు వస్తాయి కదా అప్పుడు ఇవ్వు అని అంటుంది మీనా అమ్మ. ఇంకా ఎక్కడైనా ప్రయత్నిస్తా.. ఎక్కడా దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం అని మీనా అంటుంది. బాలు తన ఫ్రెండ్స్‌తో కలిసి బారులో కూర్చుని తాగుతుంటాడు. అరేయ్.. అసలు పోలీసులు అంటే ఎవర్రా అని అడుగుతాడు. టోపీ పెట్టుకునేవాడు.. లాఠీ పట్టుకునేవాడు అని చెప్తుంటారు. ఏమో రా నాకు తెలీదు భయం అని అంటాడు ఇంకొకడు. పోలీసులు అంటే.. రక్షక భటులు కానీ కక్షక భటుల్లా చేస్తున్నారు.. వాళ్లంటే భయపడిపోవాలన్నట్టుగా చేస్తున్నారు.. మన కోసం వాళ్లు ఉన్నార్రా.. కానీ కొంత మంది మాత్రం కేవలం భయ పెట్టాలని చూస్తున్నారు.. ఆ అరుణ్ లాంటి వాళ్లు కావాలనే నన్ను దెబ్బ తీస్తున్నార్రా అని బాలు అంటుంటాడు. మళ్లీ ఏమైందిరా.. నువ్వు తాగడం మానేశావ్ కదా అని రాజేష్ అడుగుతాడు. ఆ అరుణ్ వల్లే తాగుతున్నా.. ఇందాక నేను కారులో కష్టమర్లతో వెళ్తుంటే.. ఆపి ఊదమన్నాడు.. నేను తాగలేదని చెప్తున్నా వినలేదు.. కష్టమర్లు వెళ్లిపోయేలా చేశాడు. .నా అహం మీద దెబ్బ తీశాడు.. అందుకే ఇప్పుడు ఇలా తాగుతున్నా.. అతని మొహం మీద అని బాలు వాగేస్తుంటాడు. అందులో అతని తప్పేంటి.. ఊదమన్నప్పుడు ఊదొచ్చు కదా.. నువ్వు ఎందుకు పదే పదే గొడవ పెట్టుకుంటున్నావ్ అని రాజేష్ అంటాడు. నువ్వు వాడి సైడ్ మాట్లాడుతున్నావా? అని బాలు ఫైర్ అవుతాడు. రేయ్ ఈ సారి నువ్వు డ్రైవ్ చేయి.. నేేను వెనకాల కూర్చుంటా అని బాలు అంటాడు. దీంతో రాజేష్ డ్రైవ్ చేస్తూ మళ్లీ అరుణ్ వద్దకు వస్తాడు. ఇది బాలు కారు కదా.. మళ్లీ ఎందుకు వస్తున్నాారు.. అని.. టెస్ట్ చేయకుండా వెళ్లిపోమని చెప్తాడు అరుణ్. నన్ను టెస్ట్ చేయండని రాజేష్ అంటే.. నాకు అనుమానం వస్తేనే చేస్తా అని అరుణ్ అంటాడు. అప్పుడు తాగలేదు.. ఊదమన్నారు.. ఇప్పుడు తాగా.. ఊదండి అని బాలు దిగి నడి రోడ్డు మీద రచ్చ చేస్తుంటాడు. ఏంటి న్యూసెన్సా అని అరుణ్ అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.




