
మన స్మార్ట్‌ ఫోన్లలో బంగారం, వెండి, రాగి వంటివి ఉంటాయని మీకు తెలుసా! సెల్‌ఫోన్లు, వాటి బ్యాటరీలు, చిప్‌ల తయారీలో 10 రకాల ఖనిజాలను వినియోగిస్తారు. అందుకే వాటి లభ్యత ప్రభావం సెల్‌ఫోన్ల ధరలపై కూడా కనిపిస్తుంది. ఒక సెల్‌ఫోన్‌లో సగటున 7 నుంచి 34 మిల్లీ గ్రాముల బంగారం వినియోగిస్తారు. ఇది ఎప్పటికీ తుప్పుపట్టని అద్భుతమైన విద్యుత్‌ వాహకం కావడంతో సర్క్యూట్‌ బోర్డులు (మదర్‌ బోర్డులు), యూఎస్‌బీ పోర్ట్‌లు, బ్యాటరీ టెర్మినల్స్, బోర్డ్‌ టు బోర్డ్‌ ప్లగ్స్‌లలో, సిమ్, ఎస్డీ కార్డులు, మైక్రోచిప్స్‌ వైర్లలో వినియోగిస్తారు. విద్యుత్‌ సంకేతాలు, డిజిటల్‌ డేటాను వేగంగా బదిలీ చేయడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. పల్చటి పూతలా వాడతారు. ఓ స్మార్ట్‌ ఫోన్‌లో 200 నుంచి 350 మిల్లీ గ్రాముల వరకు వెండి ఉంటుంది. ప్రింటెట్‌ సర్క్యూట్‌ బోర్డులు, సోల్డర్లు, స్విచ్‌ల్లోనూ, అంతర్గత కనెక్షన్‌ పాయింట్లలో వినియోగిస్తారు. మైక్రో చిప్‌లు, సెమీ కండక్టర్లలనూ వెండిని ఉపయోగిస్తారు. ఒక స్మార్ట్‌ ఫోన్‌లో 15 నుంచి 30 గ్రాముల వరకు రాగి వినియోగిస్తారు. ఎలక్ట్రికల్‌ కండక్టివిటీ, సిగ్నల్‌ ట్రాన్స్‌మిషన్, థర్మల్‌ మేనేజ్మెంట్‌లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, చిప్‌లు, బ్యాటరీలు, హీట్‌ సింక్‌లు, స్పీకర్లు, మైక్రోఫోన్లు, వైబ్రేషన్‌ మోటార్లు, ఛార్జింగ్‌ భాగాల వైరింగ్‌లో రాగి ఉపయోగిస్తారు. ఒక స్మార్ట్‌ ఫోన్‌లో 40 మిల్లీ గ్రాముల వరకు టాంటలమ్‌ ఉంటుంది. ఇది వేడిని తట్టుకునే అరుదైన లోహం. సెల్‌ఫోన్‌ తయారీలో కాంపాక్ట్, అధిక పనితీరు కలిగిన కెపాసిటర్లకు దీన్ని ఉపయోగిస్తారు. టాంటలమ్‌ కెపాసిటర్లు విద్యుత్‌ శక్తిని నిల్వచేసి, విడుదల చేస్తాయి. చిన్న బ్యాటరీల్లా పనిచేస్తూ, ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లు, రేడియో సిగ్నల్స్‌కు విద్యుత్‌ సరఫరాను నియంత్రిస్తాయి. టాంటలమ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్లలో వేవ్‌ ఫిల్టర్‌గా పనిచేస్తుంది. ఇది బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌ వంటి అంతర్గత యాంటెనాలు ఒకదానికొకటి అంతరాయం కలగకుండా పనిచేస్తాయి. సెల్‌ఫోన్లలో వినియోగించే రీఛార్జబుల్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీల తయారీలో కోబాల్ట్‌ను కీలకమైన ముడి పదార్థంగా వినియోగిస్తారు. ఇది బ్యాటరీలను స్థిరీకరించి, పనితీరు, భద్రతను మెరుగుపరుస్తుంది. బ్యాటరీని బట్టి.. ఒక్కో స్మార్ట్‌ ఫోన్‌లో 5 నుంచి 10 గ్రాముల కోబాల్ట్‌ ఉపయోగిస్తారు. లిథియం-అయాన్‌ బ్యాటరీకి శక్తినిస్తుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌కు చెందిన రీఛార్జబుల్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీలో 1 నుంచి 3 గ్రాముల స్వచ్ఛమైన ఎలిమెంటల్‌ లిథియం వినియోగిస్తారు. ఒక వాట్‌-అవర్‌ (డబ్ల్యూహెచ్‌) సామర్థ్యంతో ఉన్న బ్యాటరీలో దాదాపు 0.3 నుంచి 0.6 గ్రాముల లిథియం ఉంటుంది. ఇది అత్యంత తేలికైన లోహ మూలకం. దీనివల్ల సెల్‌ఫోన్‌ బరువు అతి తక్కువగా ఉంటుంది. ఇది తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్‌ శక్తిని నిల్వ చేస్తుంది. ఒక్కో స్మార్ట్‌ ఫోన్‌లో 10-15 గ్రాముల గ్రాఫైట్‌ ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా లిథియం-అయాన్‌ బ్యాటరీలో నిక్షిప్తమై ఉంటుంది. సాధారణంగా ఓస్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ మొత్తం బరువులో 10-20 శాతం గ్రాఫైటే ఉంటుంది. దీనిని బ్యాటరీ పవర్, థర్మల్‌ కూలింగ్‌లో వినియోగిస్తారు. మొబైల్‌కి చెందిన లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో గ్రాఫైట్‌ నెగిటివ్‌ ఎలక్ట్రోకోడ్‌గా ఏర్పడుతుంది. గ్రాఫైట్‌ షీట్లు/ఫిల్మ్‌లు ఫోన్‌ అతిగా వేడెక్కకుండా చూస్తాయి. ఒక స్మార్ట్‌ ఫోన్‌లో దాదాపు 2.72 గ్రాముల నికెల్‌ ఉంటుంది. రీఛార్జబుల్‌ బ్యాటరీలు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్ట్రక్చరల్‌ షీల్డింగ్‌లో దీనిని వినియోగిస్తారు. లిథియం-అయాన్‌ బ్యాటరీలో నికెల్‌ ఆధారంగా ఉండే క్యాథోడ్‌లు వోల్టేజ్‌ స్థిరత్వాన్ని గరిష్ఠస్థాయికి పెంచుతాయి. దీనివల్ల ఫోన్‌ ఛార్జ్‌ను ఎక్కువ సమయం నిలిపేలా చేస్తుంది. రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ 17 రసాయన లోహాల సమూహంతో కూడిన రేర్‌ఎర్త్‌ ఎలిమెంట్స్‌.. పది ఎలిమెంట్స్‌ను వినియోగిస్తారు. సెల్‌ఫోన్‌ ప్రకాశవంతమైన రంగుల తెరలు, చిన్న పవర్‌ స్పీకర్లు, వైబ్రేషన్‌ మోటార్లు తయారుచేసేందుకు వినియోగిస్తారు. సూక్ష్మ కెమెరా లెన్సులలో కూడా వీటిని ఉపయోగిస్తారు. ఒక్కో సెల్‌ఫోన్‌లో సగటున 0.15 గ్రాముల నుంచి 0.25 గ్రాముల రేర్‌ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఒక స్మార్ట్‌ఫోన్‌ ముడిపదార్థాల్లో 25 శాతం వరకు సిలికాన్‌ ఉంటుంది. ఒక్కో ఫోన్‌లో సగటున 5-10 గ్రాముల హై ప్యూరిటీ సిలికాన్‌ వినియోగిస్తారు. ఫోన్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, మెమురి చిప్‌లు, రేడియో భాగాలకు సిలికాన్‌ సెమీ కండక్టర్‌ ఆధారంగా పనిచేస్తుంది. సెల్‌ఫోన్‌ డిస్‌ప్లేల కోసం గట్టిగా ఉండేలా, గీతలు పడకుండా ఉండే అల్యూమినో సిలికేట్‌ గ్లాస్‌ తయారు చేసేందుకు సిలికా ప్రధాన కాంపొనెంట్‌గా ఉపయోగపడుతుంది. ఫోన్‌లో వేడి నియంత్రించేందుకు, దుమ్మ, తేమ లోపలికి చేరకుండా సీల్‌ చేయడానికి రబ్బరైజ్డ్‌ సిలికాన్‌ సమ్మేళనాలను ఉపయోగిస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.