
గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ తెదేపా కమిటీ నియామకం దోహదపడుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. ఇటీవల గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ తెదేపా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కిశోర్‌బాబు చలసానిని గుంటూరులో తెదేపా నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, గుంటూరు మిర్చియార్డ్‌ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, యువ నేత నారా లోకేశ్‌ నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని.. ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెదేపా బలోపేతానికి కృషి చేయాలని కిశోర్‌ బాబును కోరారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. గ్లోబల్ ఎన్ఆర్ఐ తెదేపా ప్రధాన కార్యదర్శిగా కిశోర్‌బాబు చలసాని ఎంపిక అభినందనీయమన్నారు. ఆయన నియామకంతో ఐరోపాలో తెదేపా బలోపేతానికి మరింత కృషిచేసే అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిదని కొనియాడారు.
కిశోర్‌బాబు చలసాని మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడున్నా మన మూలాలు తెలుగు నేలలోనే ఉంటాయని అన్నారు. మన అనుభవం ప్రపంచానికి.. మన సేవ మాతృభూమికి అనే విషయాన్ని ప్రవాసాంధ్రులు గుర్తుపెట్టుకోవాలన్నారు. దీన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ తెదేపా ప్రధాన కార్యదర్శి పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అందరం సమష్టిగా పనిచేసి చంద్రబాబు, నారా లోకేశ్‌ ఆలోచనలకు అనుగుణంగా.. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా కృషిచేస్తామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
