
ఈనాడు, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయింపు ఆరోపణపై దాఖలైన రెండు పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. దానంపై అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత నెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం... తీర్పును ఈ నెల 16కి ధర్మాసనం వాయిదా వేసింది. అయితే తీర్పు సిద్ధం కాకపోవడంతో ఈ నెల 18న వెలువరిస్తామంటూ బుధవారం తెలిపింది. మిగిలిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లను కొట్టివేస్తూ స్పీకర్‌ వెలువరించిన తీర్పులను సవాలు చేస్తూ పలువురు భారాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను హైకోర్టు అక్టోబరు 6కు వాయిదా వేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.