
22ఏపై చర్చలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్ల పాలనలో భారాస నాయకులు భారీ సంఖ్యలో ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూముల్ని ఆక్రమించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ‘రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌-22ఏ’ అంశంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రామచంద్రునాయక్, టి.రామ్మోహన్‌రెడ్డి, నవీన్‌యాదవ్, బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పైలట్‌ రోహిత్‌రెడ్డి సైతం ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని వీర్లపల్లి శంకర్‌ ఆరోపించారు. దళిత, గిరిజనులకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ భూముల్ని భారాస ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు లాక్కున్నారని రామచంద్రునాయక్‌ విమర్శించారు. మేళ్లచెరువులో 242 ఎకరాల భూదాన్‌ భూముల్ని కొందరు అమ్ముకున్నారని అక్రమంగా తీసుకున్న వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘భారాస నేతలు చేసిన అక్రమాలపై విచారణ జరగాలి. ఆ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు విదేశాలకు పోకుండా వారి పాస్‌పోర్టులను జప్తు చేయాలి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి’ అని టి.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ పేదలకు భూములు పంచే పార్టీ. ధరణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి తెచ్చింది. నిషేధిత జాబితా నుంచి అర్హులైన వారి భూముల్ని తీసేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్‌లో భారాస పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ఇచ్చిన దాని కంటే అదనపు భూమిని ఆ పార్టీ ఆక్రమించింది’ అని నవీన్‌యాదవ్‌ ఆరోపించారు. ‘కొందరు నాయకులు అక్రమంగా భూములు పొంది రైతుబంధు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. దామరచర్ల ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే భాస్కరరావు ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అందుకే ఆయన అప్పట్లో పార్టీ మారారు. బినామీల పేర్లతో భూములు తీసుకున్నవారి వ్యవహారాల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి’ బత్తుల లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





