
వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు చేసిన ఐఐటీ మద్రాస్‌ ముప్పు అంచనాకు సాంకేతిక టూల్స్‌ తెచ్చిన పరిశోధకులు వరద ఉద్ధృతిని పరీక్షిస్తున్న పరిశోధక బృందం ఈనాడు, చెన్నై: వాతావరణ మార్పులతో తీర ప్రాంతాల్లో విపత్తులతో భారీనష్టం వాటిల్లుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రంతో కలిసి ఐఐటీ మద్రాస్‌ పరిశోధనలు చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో ఐఐటీఎంలో వాతావరణ మార్పులపై పరిశోధన చేసే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన పరిశోధకులు కీలక ప్రతిపాదనల్ని రూపొందించారు. వాతావరణ శాస్త్రం, తీరప్రాంత పర్యావరణ ఇంజినీరింగ్‌ వ్యవస్థల్ని మిళితం చేసి సాంకేతిక టూల్స్‌ను ప్రభుత్వాల కోసం తయారుచేశారు. ముప్పుల్ని ఎదుర్కొనేందుకు తీర దుర్బలత్వ సూచీ (కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌-సీవీఐ)ని, పలు టూల్స్‌ను రూపొందించారు. వీటి ద్వారా తుపాన్లు, ఉప్పెన అంచనాల్ని మెరుగ్గా తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. సముద్రమట్టం పెరుగుదల, తుపాన్లు, ఉప్పెనల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఓడరేవుల్ని, అక్కడి మౌలిక వసతుల్ని కాపాడుకునేందుకు నిర్మాణ పర్యవేక్షణ పద్ధతుల్ని వృద్ధిచేశామని వివరించారు. వరద ముప్పున్న పట్టణాలు, నగరాల కోసం జలాశయాల నిర్వహణ వ్యూహాల్ని ప్రతిపాదించారు. భూగర్భజలాల్లో ఉప్పునీటి చొరబాటు, నివారణ, ఉపశమన చర్యల అంశాల్లో పరిష్కారాలు పొందే వీలుందని తెలిపారు. తీరంలో మురుగునీటి కాలుష్య పరిష్కారానికి పేటెంట్‌ పొందిన పద్ధతుల్ని ఐఐటీ మద్రాస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అన్వయిస్తూ ప్రతిపాదనలు చేసింది. మురుగునీటి శుద్ధి ప్రక్రియను ప్రతిపాదించినట్లు ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ.సన్నాసిరాజ్‌ వివరించారు. విధానాలతో విపత్తుల నుంచి తీరాల్లోని పోర్టులు, హార్బర్లు, విద్యుత్తు ప్లాంట్లు, పరిశ్రమలు, పర్యావరణం, ప్రజల్ని కాపాడవచ్చని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కో-ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు. చెన్నై పరిసరాల్లో ప్రయోగాలు ఐ ఐటీఎం పరిశోధక బృందం చెన్నై, సమీపంలోని ఎన్నూర్, కారైకాల్‌లో వారు రూపొందించిన సాంకేతిక టూల్స్‌తో పలు ప్రయోగాలు చేశారు. ఈ ఫలితాల ఆధారంగా కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు ఓ బృందం తీర రాష్ట్రాల్లోని ఇబ్బందుల్ని అధ్యయనం చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





