
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలను రక్షించేందుకు వెంటనే రక్షక తడులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకు రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటల సాగుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ, అనుబంధ శాఖలపై సమీక్షించారు. ‘ఏ పంటలకు మార్కెట్‌ జోక్యం అవసరమో అధికారులు గుర్తించాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను వాటికి అమలు చేయాలి. రైతులు ఆ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలి. నిత్యావసరాల ధరలు పెరగకుండా రైతు బజార్లు, రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేసేలా చూడాలి. ఎప్పుడూ పండించే ప్రాంతాల్లోనే కాకుండా.. కొత్త ప్రాంతాల్లో ఉల్లి, మిరప తదితర పంటల్ని పండించేలా ప్రోత్సహించాలి. పశువుల దాణాకు ఇబ్బంది లేకుండా చూడండి’ అని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యల్ని ప్రతి నెలా కేంద్రానికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ఐఎస్‌ఎస్‌సీఏ గ్లోబల్‌ అవార్డు-2026 రావడంపై చంద్రబాబు అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్, రామానాయుడు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





