
ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సభ నడవకుండా కాంగ్రెస్, భారాసలు కలిసి నాటకం ఆడాయని మండిపడ్డారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘సభలో భాజపా బాధ్యతాయుతంగా అవినీతి, భూ అక్రమాలపై గళమెత్తుతుంటే.. మంత్రులు మైకులు కట్‌ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు భారాస, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒకరినొకరు దూషించుకున్నట్లు నటిస్తూ.. ఉద్దేశపూర్వకంగా సభ సమయాన్ని వృథా చేశాయి. శనివారం 22ఏ నిషేధిత జాబితాపై సంబంధిత మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారే కానీ.. 50 లక్షల మంది రైతులు, పేద వర్గాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఇంత భారీ కుంభకోణం జరిగిందని తెలిసినా ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? ఈ మొత్తం భూ బాగోతంపై సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




