
సెకీ టెండర్లలో యూనిట్‌ రేటు రూ.5.99 రాష్ట్ర ఈఆర్‌సీ అనుమతించిన ధర రూ.5.33 జెన్‌కో మాత్రం రూ.6.65కి కొనేందుకు ప్రైవేటు సంస్థతో టెండర్‌! ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఎవరైనా ఏదైనా వీలయినంత తక్కువ ధరకే కొనాలని చూస్తారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ జెన్‌కో చేపడుతున్న విద్యుత్‌ కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కరెంటు కొనుగోలుకు డిస్కంలు జాతీయ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలనేది ఆనవాయితీ. పునరుద్ధరణీయ ఇంధన (ఆర్‌ఈ) ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలుకు ‘భారత సౌర విద్యుత్‌ సంస్థ(సెకీ)’ ఇటీవల జాతీయస్థాయిలో పిలిచిన టెండర్లలో ఒక యూనిట్‌ కరెంటు కొనుగోలు ధర రూ.5.26కే ఖరారైంది. ఆర్‌ఈ అంటే పగలు మాత్రమే వచ్చే సౌరవిద్యుత్‌ కాకుండా రాత్రిపూట కూడా కలిపి (24 గంటలూ) కరెంటు సరఫరా చేయాలని సెకీ టెండర్లలో నిబంధన పెట్టింది. అంటే పగలు సౌర విద్యుత్, రాత్రిపూట బ్యాటరీ ఎనర్జీ నిల్వ వ్యవస్థ (బెస్‌) లేదా పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంటు (పీఎస్‌పీ) నుంచి కరెంటు సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లలో ఈ ధర (రూ.5.26)నే ప్రాతిపదికగా తీసుకుని.. వీలైతే అంతకన్నా తక్కువ రేటుకే అన్ని రాష్ట్రాల డిస్కంలు కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రోజూ ఉదయం, సాయంత్రం 7 నుంచి 11లోపు కొన్ని గంటల సమయం మాత్రమే రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతోంది. అంటే ఈ సమయంలో అన్నివర్గాల వారు కరెంటు వినియోగించడం వల్ల భారీగా కరెంటు సరఫరాకు తెలంగాణ డిస్కంలు సిద్ధంగా ఉండాలి. ఇలా గరిష్ఠ డిమాండ్‌ ఉన్న సమయంలో ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌)’ నుంచి ఒక యూనిట్‌ కరెంటును రూ.10 వరకూ చెల్లించి రాష్ట్ర డిస్కంలు కొంటున్నాయి. దీనివల్ల భారీగా ఆర్థిక భారం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల డిస్కంలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇలా గరిష్ఠ డిమాండ్‌ ఉండే సమయంలో కరెంటు సరఫరాకు సెకీ తాజాగా టెండర్లు పిలవగా యూనిట్ రూ.5.99కే ఇస్తామని ఒక కంపెనీ ముందుకొచ్చింది. గరిష్ఠ డిమాండ్‌ ఉండే సమయంలో కరెంటు సరఫరా చేయాలని ఒక ప్రైవేటు సంస్థకు యూనిట్కు ఏకంగా రూ.6.65 చొప్పున చెల్లించేందుకు తెలంగాణ జెన్‌కో తాజాగా టెండర్లను ఖరారు చేస్తోంది. ఈ ఏడాది కరెంటు గరిష్ఠ కొనుగోలు ధర రూ.5.33కి మించకూడదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ ధరతో లేదా అటు జాతీయ ధర (రూ.5.99)తో పోల్చిచూస్తే.. అంతకన్నా ఎక్కువగా చెల్లించి కరెంటు కొనుగోలుకు జెన్‌కో ఎందుకు సిద్ధమవుతోందనేది చర్చనీయాంశంగా మారింది. జెన్‌కో కొనుగోలుచేసే కరెంటుకు యూనిట్కు మరో 7 పైసలు చొప్పున కమీషన్‌ తీసుకుని డిస్కంలకు అమ్మడానికి కసరత్తులు చేస్తోంది. దీంతో కలిపితే యూనిట్‌ కొనుగోలు ధర రూ.6.72 అవుతుంది. ఈ రేటుకు కొంటామనే ప్రతిపాదనలతో డిస్కంలు ఈఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. జాతీయస్థాయిలో సెకీ కొనుగోలు ధర, ఈఆర్‌సీ అనుమతించిన ధర కన్నా అధికంగా వెచ్చించి జెన్‌కో కొంటే దానిని తిరిగి కొనడానికి డిస్కంలు ఎలా అంగీకరిస్తాయన్నది కీలక ప్రశ్న. ఒకవేళ ఈ ప్రతిపాదనలను డిస్కంలు ఇస్తే ఈఆర్‌సీ అనుమతిస్తుందా అనేది త్వరలో తేలనుంది. ఇదే కొనుగోలు రేటుకు అంగీకరిస్తే.. రాబోయే ఐదేళ్లపాటు డిస్కంలపై, అంతిమంగా ప్రజలపై అదనపు ఆర్థికభారం పడనుందని ఇంజినీర్లు చెబుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





