
హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌ మేడ్చల్‌ కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జ్యోతి వెలిగిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌. చిత్రంలో మేడ్చల్‌ మల్కాజిగిరి ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి వి.బాలభాస్కరరావు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ నర్సింగ్‌రావు తదితరులు ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, మేడ్చల్‌ పట్టణం: న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే కాకుండా సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌ పిలుపునిచ్చారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నూతనంగా నిర్మించనున్న ఆధునిక కోర్టు సముదాయానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఐదెకరాల స్థలంతోపాటు రూ.117 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. న్యాయ నిర్మాణ్‌ ప్రణాళికలో భాగంగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులతో సహా మొత్తం 16 కోర్టు హాళ్లు రానున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఇక్కడ న్యాయాధికారుల సంఖ్యను పెంచే అంశంపై హైకోర్టు చురుగ్గా పనిచేస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో బెంచ్, బార్‌ కలిసి పనిచేయాలి. పరిపాలనలో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ఎంత ముఖ్యమో, న్యాయవ్యవస్థలో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ జస్టిస్‌’ కూడా అంతే ముఖ్యం. నూతన నేర చట్టాల అమలు నేపథ్యంలో కేసుల వేగవంతమైన పరిష్కారానికి క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్, ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటి సాంకేతిక సాధనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి’ అని జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌ సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు భవన నిర్మాణ కమిటీ సభ్యులు జస్టిస్‌ కె.లక్ష్మణ్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ నర్సింగ్‌రావు, మేడ్చల్‌ మల్కాజిగిరి ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి వి.బాలభాస్కరరావు, మేడ్చల్‌ అడ్వొకేట్‌ బార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సి.హనుమంతరెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





