
పొన్నం సత్తయ్య జీవనసాఫల్య పురస్కారం ప్రదానోత్సవంలో వక్తలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న కోదండరెడ్డి, వెలిచాల కొండలరావు, కనకవ్వ. చిత్రంలో జూపల్లి కృష్ణారావు, మహేశ్‌కుమార్‌గౌడ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌ రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఉమ్మడి కుటుంబం అనేది బలమైన సామాజిక వ్యవస్థ అని.. ఆ విలువలను కొత్త తరానికి అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (కరీంనగర్‌) ఆధ్వర్యంలో ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానోత్సవం నిర్వహించారు. రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.కోదండరెడ్డి (వ్యవసాయం), విద్యావేత్త వెలిచాల కొండలరావు (సాహిత్యం), గాయని కనకవ్వ (జానపద రంగం)లను శాలువా, జ్ఞాపిక, రూ.50 వేల నగదు పురస్కారంతో సత్కరించారు. ముఖ్యఅతిథి శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి, రైతులకు విలువ ఇవ్వడంలో పొన్నం సత్తయ్య ఆదర్శంగా నిలిచారని అన్నారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పొన్నం సత్తయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ఆశయాలను ముగ్గురు కుమారులు ప్రభాకర్, రవిచంద్ర, అశోక్‌ ముందుకు తీసుకెళ్లడం ఈతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడారు. ట్రస్ట్‌ ద్వారా సామాజికంగా వెనుకబడినవర్గాల పిల్లలకు విద్య, శిక్షణ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. తమ తండ్రి పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం నాలుగేళ్లుగా విద్య, సామాజిక, కళా రంగాల్లో ప్రముఖులకు పురస్కారాలు ఇస్తున్నాం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా ఇందులో చేర్చామన్నారు. సభలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సామాజికవేత్త ప్రొ.హరగోపాల్, డా.మామిడి హరికృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొ.మాడభూషి శ్రీధర్, ఆర్‌.దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





