
ఎస్సీ సంక్షేమ శాఖలో మళ్లీ డిప్యుటేషన్లు ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయ పరిపాలనలో టీచర్ల డిప్యుటేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. బోధన సిబ్బంది బోధనేతర పనుల్లో నియమించకూడదని అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేసిన నాలుగు నెలల వ్యవధిలో తిరిగి నియామకాలు చేపడుతోంది. సొసైటీ కార్యాలయంలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 స్థాయి ఉద్యోగులు 50 మందికి పైగా ఉన్నప్పటికీ.. ఆయా సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది మేలో 16 మంది డిప్యుటేషన్లు రద్దు చేయగా.. రెండు రోజుల క్రితం వారిలో ఇద్దరికి తిరిగి నియామకాలు ఇచ్చింది. సొసైటీ పరిపాలన విధుల్లో బోధన సిబ్బందిని నియమించకూడదని ఇటీవల ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు బోధన చేయాల్సిన సిబ్బంది.. ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్, పరిపాలన విధుల పేరిట ఇక్కడికి రావడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. కీలకమైన సబ్జెక్టుల టీచర్లు లేకపోవడంతో పాఠశాలలు, గురుకులాల్లో సర్దుబాటు కష్టమవుతోంది. సొసైటీ కార్యాలయంలో అవసరమైన రెగ్యులర్, పొరుగు సేవల సిబ్బంది ఉన్నప్పటికీ, అదనంగా తీసుకురావడంపై విమర్శలు వచ్చాయి. గతంలో ప్రధాన కార్యాలయాల్లో పనిచేసిన సిబ్బందిలో కొందరు టీజీటీగా చేరి.. క్షేత్రస్థాయిలో బోధన చేయకుండానే డిగ్రీ లెక్చరర్, ప్రధానోపాధ్యాయుల వరకు పదోన్నతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. కొందరు మంత్రికి ఫిర్యాదు చేయడంతో వివరాలు పరిశీలించి డిప్యుటేషన్లు రద్దు చేశారు. తాజాగా పరిపాలన సౌలభ్యం కోసమని ఇద్దరు టీచర్లకు ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్లు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




