
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆందోళన సమావేశంలో మాట్లాడుతున్న ఏవీ నాగేశ్వరరావు గుంటూరు (నెహ్రూనగర్‌), న్యూస్‌టుడే: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 20 ఏళ్లుగా ఎదురు చూశామని, ఇకపై ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఏపీ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్, టీచర్స్‌ జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో ఆదివారం రణభేరి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.7 వేలు, రూ. 8 వేల వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులని పేర్కొంటూ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 3.50 లక్షల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీవన పరిస్థితులు ప్రభుత్వానికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో తిరుపతి, రాజమహేంద్రవరంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి నవంబరులో 3.50 లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఛైర్మన్‌ బి.కాంతారావు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కనీస చర్చ జరగకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు. ఆప్కాస్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జేఏసీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి, వివిధ సంఘాల నాయకులు రవిప్రకాశ్, అప్పారావు, కల్యాణి, ఏడుకొండలు, స్వామి, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.