
బైక్‌ను ఢీకొనడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి పెనమలూరు, చల్లపల్లి, న్యూస్‌టుడే: వైద్యుడు మద్యం తాగి, మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఢీకొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు శివార్లలో చోటుచేసుకుంది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకావారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పల ఉదయ్‌కిరణ్‌ (21) కానూరు పీవీపీ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. తాడిగడప శ్రీనగర్‌కాలనీ ఎన్టీఆర్‌నగర్‌లోని ఓ భవనంలో స్నేహితులతో కలిసి ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. ఆదివారం తెల్లవారుజామున స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకొని బయటకు వచ్చాడు. పంటకాలువ రహదారిలో వెళ్తుండగా.. సనత్‌నగర్‌ మలుపు వద్ద ఎదురుగా వేగంతో వస్తున్న ఈవీ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. తరువాత కారు పక్కనే ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొట్టి, డ్రైన్‌లోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉదయ్‌కిరణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికులు కారు నడుపుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆయన నగరంలోని ఫెర్టికేర్‌ ఐవీఎఫ్‌ సెంటర్‌ వైద్యశాలకు చెందిన డాక్టర్‌ సూరపనేని కౌశిక్‌ చక్రవర్తిగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు. వైద్యుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడి మృతదేహాన్ని మేకావారిపాలెం గ్రామానికి తరలించగా.. తల్లి నాగమణి, బంధుమిత్రులు గుండెలవిసేలా రోదించారు. ఉదయ్‌కిరణ్‌ తండ్రి రవీంద్రబాబు కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. ఉన్నత విద్యనభ్యసించి.. జీవితంలో స్థిరపడి, ఆదుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




