
మంచిర్యాల నేర విభాగం, న్యూస్‌టుడే: రైలు కింద పడి తండ్రీ కుమారులు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్‌(52), ఆయన కుమారుడు నాగరాజు(32)లు కూలీ పని చేసేవారు.శుక్రవారం వారిద్దరు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో నివాసముంటున్న మల్లేశ్‌ సోదరుడైన శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజైన శనివారం ఇంటి నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం మంచిర్యాలలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లేశ్‌ భార్య సువర్ణ రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, తండ్రీకుమారులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరు.. బంధువులు, కుటుంబసభ్యులను కలవకుండా ఒంటరిగానే ఉంటున్నారు. చివరిచూపుగా కలిసి వెళ్లాలని తమ వద్దకు వచ్చినట్లు మృతులు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




