
చెన్నై: జీవిత బీమా, మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) రంగాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు నిర్దేశిత గడువు ప్రకారం సాగుతున్నాయని, త్వరలోనే వీటిపై బోర్డు ఆమోదం కోరనున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బినోద్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందుకోసం కొత్త అనుబంధ సంస్థలు లేదా సంయుక్త సంస్థలు ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతి పొందే ప్రక్రియ నడుస్తోందని, ఆ తర్వాత నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు ఏడాది సమయం పట్టొచ్చని, సరైన భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ముఖ్యమని, సమర్థ భాగస్వామి తోడైతే సంపద సృష్టి వేగవంతమవుతుందని బినోద్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రవాస భారతీయుల కోసం దుబాయ్‌లో ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బ్యాంక్‌ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇతర నియంత్రణ పరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం ఫలితంగా ఇండియన్‌ బ్యాంక్‌కు ఇప్పటికే యూనివర్సల్‌ సోంపో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 28.52% వాటా ఉంది. ఇందులో జపాన్‌కు చెందిన సోంపోకు 34.61%, ఐఓబీకి 18.06%, డాబర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు 12.81%, కర్ణాటక బ్యాంక్‌కు 6% వాటాలున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





