
తె లుగువాడిది పోలీసు బుర్ర. ‘లేదురా ఇటువంటి బుర్ర ఇంకెందునా’ అని పాడుకోదగిన తెలుగువాడి తెలివిలోంచి పుట్టిన ‘దొంగలూ దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్టు’ అన్న సామెత ఎంతోమంది బండారం బయటపెట్టేస్తుంది. ‘దొరికితే దొంగ, దొరకక పోతే దొర’ అన్నదీ తెలుగువాడే. మన రాజకీయాల గురించి రెండు ముక్కల్లో చెప్పమంటే టక్కున ఈ సామెతను అప్పజెప్పవచ్చు. మేడిపండు నాయకుల ముసుగు తీసి చూపించవచ్చు. మన రాజకీయ నాయకులు కళలను ఆదరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఇది చాలా అన్యాయం. వాళ్లలో కొంతమంది ‘ఒక్క’ కళను చక్కగా ఆదరిస్తున్నారు. నిజాయతీకి చుక్కలు చూపిస్తున్నారు. కొందరు స్వయంగా దాన్ని ఆచరిస్తూ, పగలు రాత్రి తేడా లేకుండా అందులోనే చరిస్తున్నారు. పెద్దలు చెప్పిన 64 కళల్లో దొంగతనం కూడా ఒకటి కదా. దానిమీద మనసు పారేసుకున్న కొందరు నేతలు చోరశిఖామణులై దోచుకున్న డబ్బును ఎక్కడపడితే అక్కడ దర్జాగా దాచుకుంటున్నారు. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు. అప్పటి ప్రభువులు గుప్తంగా ఏమీ కొట్టేయకపోయినా ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పటి మహానేతలు గుప్తంగా కోట్లకు కోట్లు కొట్టేస్తూ ఆగడాల అనుంగు వారసులకు ‘స్వర్ణ యుగం’ సృష్టిస్తున్నారు. కన్నబిడ్డలనే ప్రజల్లాగా చూసుకుంటూ సరికొత్త రివర్స్‌ అశోకుల్లాగా తయారయ్యారు. ఇదంతా తెలుగువాడు ముందే ఊహించాడో ఏంటో కానీ, కంచే చేను మేస్తే పరిస్థితేంటి అని సందేహపడ్డాడు. ప్రజాస్వామ్యానికి కంచెలా మారి కంటికిరెప్పలా కాపలా కాస్తారని పెట్టుకున్న ప్రజాప్రతినిధుల్లో కొందరు ‘దొంగతనం పెద్ద నేరమా ఏమిటి’ అని ఎదురు ప్రశ్నించే లెవల్‌కు ఎదిగిపోయారు. అవినీతిలో వారు అన్ని లెవల్‌ క్రాసింగ్‌లనూ దాటేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తమలోతాము రాజీలు కుదుర్చుకుని మరీ దొంగ రాజకీయాలు చేస్తున్న దొరలూ పుట్టుకొస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదాయాన్ని దయ్యంలాగా పట్టుకుని అందరం సమానంగా పంచుకుందామని రాజకీయ గిరీశాలుగా మారిన 60 మంది కౌన్సిలర్లు తీర్మానించుకున్నారు. ఈ అడ్డదారిని వీడిపోకుండా ఉందామని గంగాజలం చేతపట్టుకుని మరీ ప్రమాణాలు చేసుకున్నారు. గుట్టు తెలియకుండా ఒకానొక్క చోట సమావేశమై లంచాల పంపకాల్లో కట్టు తప్పకుండా జుట్టూ జుట్టూ పట్టుకోకుండా ఉంటామని జట్టుగా ఒట్టు పెట్టుకున్నారు. ఇలా ఒక్కతాటి మీద, ఒక్క ‘త్రోట్‌’ మీద నిలిస్తే తమ అవినీతి బాగోతాలేవీ బయటపడవన్నది ఆ మహానుభావుల ధీమా... వాళ్ల రాజకీయాలకు అదే బీమా! మామూలుగా కుంభకోణాలు జరిగినప్పుడు అవి ఎలా బయటపడుతుంటాయి? మేసిన నేతల పొడగిట్టని సాటి రాజకీయ నాయకుల వల్ల కాదూ! ఇలాగ నేతల మధ్య చీలికలు రావడం వల్ల వాళ్ల భవిష్యత్తు పేలికలు అవుతోంది. మరి దీనికి పరిష్కారమేంటి? అన్ని ప్రజా సమస్యలనూ ‘తినీ’ తినక పరిష్కారం చేసే (అ)రాజకీయ నాయకుల ఏకైక సమస్యకు పరిష్కారం లేకపోతే ఎంత ‘షిగ్గు షేటు’. అందుకేనేమో ప్రమాణాల రూపంలో తిరుగులేని పరిష్కారం దొరికినట్టు ఆ కౌన్సిలర్లు ఫీలైపోయారు. షాజహాన్‌పూర్‌ నాయకుల్లాంటివారు తాజ్‌మహల్‌ నిర్మాణంలో పాలుపంచుకుని... కాదు కాదు ‘రాళ్లు’ పంచుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుని ఉండి ఉంటే, అది షాజహాన్‌కు తెలిసి ఉంటే ఏం చేసేవాడో వర్ణనాతీతం! మన ప్రజాస్వామ్యం గ్రహచారం ఏంటో కానీ, ‘నీకది-నాకిది’ స్కీములో స్కాములెన్నో చేసి జగత్ప్రసిద్ధికెక్కిన వాళ్లకు కూడా అంత త్వరగా శిక్షలుపడవు. అదే నమ్మకంతో షాజహాన్‌పూర్‌ కౌన్సిలర్లు ముడుపులకోసం ప్రమాణం చేసుకున్నారు గానీ ముప్పు తప్ప లేదు. వాళ్లు మొదలుపెట్టిన అడ్డగోలు ప్రయాణం గుట్టు ఆదిలోనే రట్టు అయ్యింది. ప్రజాధనాన్ని పంచుకుతిందామంటూ వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కౌన్సిలర్లకు ఒక్కసారిగా చక్కర్‌ వచ్చేసింది. జనం సొమ్మును ఆబగా మేయదలుచుకున్న వారికి మేయర్, మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు రంగం సిద్ధం చేశారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సంపద మొత్తం ఒకరి జేబులోకి చేరిపోకూడదని, సమాజంలోని అందరికీ సమానంగా లబ్ధి చేకూరాలనే సోషలిజం నినాదాలు ఒకప్పుడు దేశంలో దిక్కులు పిక్కటిల్లేలా వినపడేవి. వాటికి జైకొట్టని పార్టీలకు అప్పట్లో అది పెద్ద మైనస్‌ అయిపోయేది. ప్రత్యేకంగా సోషలిస్టు పార్టీలూ అనేకం పుట్టుకొచ్చాయి. సంపదను జనానికి సమానంగా పంచుదామన్న ఆ రోజులు పోయి, మనమే సమానంగా పంచుకుందామనే రీతికి రాజకీయ రోత చేరింది. దాన్ని శుభ్రం చేయాలంటే ముందు గంగాజలాన్ని పట్టుకుని చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించిన అక్రమార్కులకు శిక్ష పడాల్సిందే. అవినీతిలో అడుగుజాడ అనుకున్నది ‘మడుగు జాడ’ అయ్యిందే అని వాళ్లు వగచి వగచి చింతించాల్సిందే. కానీ, తెలుగువాడే చెప్పినట్టు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఉద్ధండులైన అవినీతి నాయకులను శిక్షించాలంటే వినాయకుడే దిగిరావాలేమో! దొంగ రాజకీయాలనే విఘ్నాలను తొలగించాలని, ప్రజాస్వామ్య వెలుగులను పెంచాలని ఈ పండుగ పూట ఆ విఘ్నేశ్వరుణ్ని కోరుకుందాం! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





