
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వైవాహిక జీవితంలో సంతృప్తి ప్రాధాన్యతను వివరిస్తూ కీలక సందేశాన్నిచ్చారు. పెళ్లి చూపుల సందర్భంగా అడిగే ప్రశ్నల్లో డబ్బులు, హోదా, ఉద్యోగం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, “మీరు ఉన్నదానితో సంతృప్తిగా ఉన్నారా?” అనే ప్రశ్నకే మొదటి స్థానం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ఒక్క ప్రశ్న జీవిత భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుందని, విడాకుల ప్రసక్తి లేకుండా జీవితాంతం సీతారాముల్లా సంతోషంగా జీవిస్తారని గరికపాటి స్పష్టం చేశారు. జీవితంలో ఆపదలు ఎదురైనప్పుడు లేదా కోరుకున్నవి లభించనప్పుడు ఆగడం, నిరీక్షించడం అలవర్చుకోవాలని గరికపాటి తెలిపారు. కొన్నింటికి నెలలు, కొన్నింటికి సంవత్సరాలు ఆగాల్సి వస్తుందని, ఈ ఆగడం అలవాటు చేసుకుంటే ఏ సంబంధం తప్పినా, ఉద్యోగం పోయినా నిరాశ చెందకుండా, ఇంతకంటే మంచిదేదో ఉందని నమ్మకంతో ముందుకు సాగొచ్చని ఆయన అన్నారు. ప్రతి ధాన్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉన్నట్లు, మనకు రాసిపెట్టింది మనకు తప్పకుండా వస్తుందని, అయితే అలవర్చుకోవాల్సింది సంతృప్తి ఒక్కటేనని గరికపాటి వివరించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో ప్యాకేజీలకు, కార్పొరేట్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది వైవాహిక జీవితంలో సమస్యలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “నీ ప్యాకేజీ ఎంత? ఆ కంపెనీ ఎందుకు? ఈ కంపెనీ ఎందుకు?” వంటి ప్రశ్నలకు బదులు, “నీకు ఉన్నదానితో నువ్వు సంతృప్తిగా ఉన్నావా?” అని అడగాలని గరికపాటి నొక్కిచెప్పారు.