
Ganja Cultivation | వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకులను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వ్యవసాయ భూమిలో ఏకంగా 1,245 గంజాయి మొక్కలను గుర్తించి వేర్లతో సహా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 11 గ్రాముల ఎండు గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జైనూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. గంజాయి సాగు, రవాణా, నిల్వకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 13న జైనూర్ ఎస్ఐ జి. రవికుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్నాపూర్ మెయిన్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన అంబురే పుండలిక్ (50)ను తనిఖీ చేయగా.. అతని టవల్లో దాచిన 11 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించిన పోలీసులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పుండలిక్‌ను విచారించగా.. తన కుమారుడు రమేశ్‌తో కలిసి వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం లభించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు వ్యవసాయ విస్తరణ అధికారి ( AEO), ప్రభుత్వ పంచ సాక్షుల సమక్షంలో పుండలిక్ వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొలంలో పెద్ద సంఖ్యలో గంజాయి మొక్కలను గుర్తించారు. మొత్తం 1,245 గంజాయి మొక్కలను వేర్లతో సహా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.50 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ పంట మధ్యలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సేకరించిన ఆధారాల మేరకు ఇద్దరు నిందితులను సెప్టెంబర్ 14న అరెస్ట్ చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గంజాయి సాగుపై నిఘా పెట్టి అప్రమత్తంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న జైనూర్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.