
Former Cm Ys Jagan Express Condolence On Medico Priyanka Death 325116
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Medico Priyanka Death: రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద మద్యం మత్తులో దుండగులు కారుతో తొక్కించగా మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని.. తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.
ప్రియాంక మృతి తనను కలచివేసిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం' అని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే.. వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి! దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం' అని చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారుతోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోందని గుర్తుచేశారు. అయినా కూడా పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు.
'తప్పుడు కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. వీధికి రెండు బెల్టుషాపులు.. ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరు కూడా దీనికి మరో కారణం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మెడికో ప్రియాంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబు తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.






