
తిరస్కరించిన దరఖాస్తులను పునరుద్ధరణకు తీసుకోని ఈపీఎఫ్‌వో పరిష్కరించాలని కార్మిక సంఘాల వినతి ప్రస్తుతం అధిక పింఛను పొందుతోంది 31 వేల మంది ఈనాడు - హైదరాబాద్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని 263 మంది ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేశారు. సరైన పత్రాలు సమర్పించలేదన్న కారణంతో ఈపీఎఫ్‌వో తిరస్కరించింది. ఆ తరువాత సరైన పత్రాలు అందించి నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. వారిలో వృద్ధాప్య కారణాలతో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ సహకార సొసైటీలోని ఉద్యోగుల్లో 68 మంది అధిక పింఛనుకు అర్హులు. సకాలంలో సరైన పత్రాలివ్వలేదని దరఖాస్తు తిరస్కరించారు. సరైన పత్రాలిచ్చి.. పునరుద్ధరించాలని కోరుతున్నా స్పందన కరవు. వీరిలో నలుగురు చనిపోయారు. ఈ పీఎఫ్‌ అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వేతన జీవులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. చందాదారులకు నోటీసులు జారీకాకపోవడంతోపాటు ఆ దరఖాస్తు పరిశీలనలో ఉందో.. తిరస్కరించారో తెలియని పరిస్థితి. సరైన పత్రాలు లేవని గతంలో తిరస్కరించిన దరఖాస్తులకు ఆయా యాజమాన్యాలు, ఉద్యోగులు అర్హమైన పత్రాలు సమర్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రాంతీయ కార్యాలయాలు వాటిని పునరుద్ధరించడం లేదు. అధిక పింఛను కోసం వచ్చిన 15.24 లక్షల దరఖాస్తుల్లో 11,595 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఈపీఎఫ్‌వో వెల్లడిస్తున్నా... వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కార్మికవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 3.6 లక్షల డిమాండ్‌ నోటీసులు జారీకాగా.. 51 వేల మంది బకాయిలు చెల్లించారు. వారిలో 31 వేల మంది అధిక పింఛను పొందుతున్నారు. ఈపీఎఫ్‌వోకు వచ్చిన 15.24 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు సరైన పత్రాలు ఇవ్వలేదు. దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కేంద్ర కార్యాలయం నుంచి ఒత్తిడి రావడంతో... కొన్నింటిని సరిగా పరిశీలించకుండానే ప్రాంతీయ కార్యాలయాలు తిరస్కరించాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కార్మిక సంఘాలు తీసుకెళ్లడంతో అర్హతకు సంబంధించిన ఆధారాలిచ్చిన దరఖాస్తులను తిరిగి పునర్‌ పరిశీలించాలని తెలిపింది. తెలంగాణ నుంచి అధిక పింఛను కోసం 1.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశంలో ఇది రెండో అత్యధికం. ఇక్కడ ఎనిమిది ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఐదు చోట్ల దరఖాస్తుల పునర్‌పరిశీలనకు కార్యాచరణ చేపట్టారు. మరో మూడు కార్యాలయాల్లో పరిశీలించడం లేదు. ఎన్‌ఎండీసీ సంస్థలో ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరిస్తే... ఆ సంస్థ పదేపదే విజ్ఞప్తి చేయగా... ఇటీవల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీలోనూ 5వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతోందని ఆయా ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు దరఖాస్తు చేసినా..వాటి పరిస్థితి తెలుసుకునే వ్యవస్థ అందుబాటులో లేదు. దరఖాస్తుదారులకు స్పష్టత ఇవ్వాలి అధిక పింఛను కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులను వేగంగా పరిష్కరించి.. అర్హత ఉంటే ఉందని.. లేకుంటే లేదన్న విషయాన్ని చందాదారులకు స్పష్టంగా చెప్పాలి. అధిక పింఛను డిమాండ్‌ నోటీసు వస్తుందన్న ఆశతో... పదవీ విరమణ అనంతరం భవిష్యనిధి నగదు నిల్వలను ఖాతా నుంచి తీసుకోవడం లేదు. మూడేళ్లు దాటినా కొందరు ఈపీఎఫ్‌ నిల్వలు తీసుకోకపోవడంతో వడ్డీ నష్టపోతున్నారు. జె.శ్రీనివాస్, విశ్రాంత ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




