
కొత్తగా 31,087 మందికి ఇళ్లస్థలాల పంపిణీకి కార్యాచరణ న్యూస్‌టుడే, బాలాజీచెరువు: జిల్లాలో ఇంటి స్థలం లేని పేదలకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను విచారించిన రెవెన్యూశాఖ 31,087 మందికి కొత్తగా స్థలాలివ్వాలని గుర్తించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇవ్వడానికి అవసరమైన 900 ఎకరాలు సేకరించాలని కూటమి ప్రభుత్వం తేల్చింది. భూసేకరణకు సుమారు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేసింది. నవంబరు నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 2025, జనవరి 1 నుంచి ఇళ్ల స్థలాల్లేని పేదల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఇప్పటికి 59,310 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 31,087 మందిని అర్హులుగా, 21,856 మందిని అనర్హులుగా తేల్చారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలు, ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో అర్హులకు పట్టాలివ్వనున్నారు. జిల్లాలో 59,310 మంది దరఖాస్తు చేయగా, వాటిలో 52,943కి విచారణ పూర్తయింది. 6,358 దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. కొంతకాలం ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో ప్రక్రియ నిలిచింది. మళ్లీ పునఃప్రారంభించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





