
తుని పట్టణం: రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రగాయాలపాలైన ఓ వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ రైలు కిందకు దూరి కాపాడాడు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైన్నై తిరువళ్లూరుకు చెందిన ప్రేమ్‌కుమార్‌ గణేషన్ అన్నవరం వచ్చారు. తిరుగుప్రయాణంలో పొరపాటున విశాఖవైపు వెళ్లే రైలు ఎక్కి అనకాపల్లిలో దిగిపోయారు. అక్కడ బొకారో రైలు ఎక్కారు. తుని స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత కిందకు దిగి తిరిగి ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడిపోయాడు. అదే రైలులో ప్రయాణం చేస్తున్న యలమంచిలి గ్రామీణ పోలీస్‌ స్టేషన్ హెడ్‌ కానిస్టేబుల్ చంద్రరావు తక్షణం స్పందించారు. అధికారులు రైలు నిలుపుదల చేయించడంతో రైలు కింద దూరి వ్యక్తిని బయటకు తీసి ప్లాట్‌ఫాంపైకి చేర్చాడు. హుటాహుటిన 108 వాహనంలో తుని ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కాకినాడ తీసుకువెళ్లారు. ప్రాణాపాయం తప్పిందని, కుటుంబసభ్యులు అతన్ని చైన్నై తీసుకువెళ్లారని ఎస్సై సత్తిబాబు తెలిపారు. తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్‌ను అంతా ప్రశంసించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.