
ఊట్కూర్ : వర్షాభావంతో పత్తి, ఆముదం, కంది పంటలు ఎండిపోతుండగా, బోరుబావుల్లో నీరు అడుగంటి వరి పంటల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా ( Narasimha ) తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణపేట ( Narayanpet ) జిల్లాను కరువు జిల్లా ( Drought District ) గా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఊట్కూర్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు పత్తి, ఆముదం, కంది విత్తనాలను ఒకటికి రెండుసార్లు విత్తాల్సి వచ్చిందన్నారు. విత్తిన పంట మొలకెత్తినా, ఆ తర్వాత వర్షం లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట మొగ్గ, పూత, కాయ దశలోనే ఎండిపోతుండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చు కలిపి ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారని నర్సింహా తెలిపారు. అయితే పంట దిగుబడి తగ్గిపోవడంతో వచ్చిన పంటను అమ్మినా రూ.15 వేలు కూడా దక్కని పరిస్థితి ఉందన్నారు. గతంలో ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేదని, ఈసారి ఒకటి, రెండు క్వింటాళ్లకు పరిమితమయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.





