
బుల్లితెరపై తన మార్క్ డ్యాన్స్‌తో, కామిడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు (పండు మాస్టర్) ఇటీవల ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వైద్యులు రెండు కాళ్లకు ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన కదల్లేని స్థితిలో బెడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ స్టేజ్‌పై మునుపటిలా డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి ఆయనకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది.ఈ క్రమంలో పండుకు ఉపాధి లేదా ఆదాయ మార్గం తాత్కాలికంగా ఆగిపోయింది. సాధారణంగా బుల్లితెర కళాకారులకు ప్రాజెక్ట్‌లు ఉన్నప్పుడే ఆదాయం వస్తుంది. నిలబడే పరిస్థితి లేకపోవడంతో పండుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడింది. అందుకే ఆయన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను అలరించిన పండు, ఇకపై తన హెల్త్ అప్డేట్స్, వ్యక్తిగత విషయాలు, ఇతర విశేషాలను యూట్యూబ్ ద్వారా పంచుకోనున్నారు.





