
వినాయక చవితి వంటి పవిత్రమైన పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణ పేరుతో కేటీఆర్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చట్టాన్ని, న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించాల్సిన పోలీసు యంత్రాంగం.. కోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టి పండుగ రోజున ఈ విధంగా వ్యవహరించడం పక్కా రాజకీయ కక్షసాధింపేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా హోంశాఖను కూడా నిర్వహిస్తున్నారని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన హోంశాఖ నేరుగా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌లో లీగల్ టీమ్ సమక్షంలో ఉన్న సమయంలోనే ముసుగులు ధరించిన అపరిచిత వ్యక్తులు ప్రత్యక్షమవడం అత్యంత దారుణమని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఇలాంటి అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు? వారు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు వ్యక్తులు ప్రవేశించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను గుర్తించాలని.. ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ వంటి రక్షిత ప్రదేశంలోనే ఇలాంటి ఘటనలకు అవకాశం కల్పిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.