
ఏడాదిలోనే: ఫిక్కీ-అనరాక్‌ నివేదిక హైదరాబాద్‌ కేంద్రంగా ప్రస్తుతం 515 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జీసీసీ సెంటర్లకు అవసరమైన ప్రతిభావంతుల లభ్యత అపారంగా ఉండటం, తక్కువ వ్యయాలు అవుతున్నందున, ఏడాదిలోగా మరో 50-70 జీసీసీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, ప్రోపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. ‘హైదరాబాద్‌: ది రైజ్‌ ఆఫ్‌ ఏ గ్లోబల్‌ కేపబిలిటీ పవర్‌హౌస్‌’ పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. దీని ప్రకారం.. 2026 మార్చి చివరికి హైదరాబాద్‌లో 515 జీసీసీలు ఉండగా, వీటిలో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మన దేశంలోని మొత్తం జీసీసీల్లో సుమారు 20% హైదరాబాద్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ నగరం ‘సైబర్‌ సిటీ’ స్థాయి నుంచి ‘జీసీసీ హబ్‌’గా రూపాంతరం చెందుతోంది. హైదరాబాద్‌ కార్యాలయ స్థలాల మార్కెట్‌లో గిరాకీకి జీసీసీలు కీలకంగా మారాయి. జీసీసీల ఏర్పాటు కోసం విదేశీ సంస్థలు అద్దెకు తీసుకున్న కార్యాలయ స్థలం 2021లో 19 లక్షల చదరపు అడుగులు కాగా, 2025 నాటికి 45 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే మరో 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఆయా సంస్థలు తీసుకున్నాయి. సంప్రదాయ సేవలకు మించి: లీజింగ్‌లో వృద్ధి కొనసాగడాన్ని గమనిస్తే, ప్రపంచవ్యాప్త కంపెనీలు హైదరాబాద్‌లో తమ పెద్ద కార్యాలయాలు నెలకొల్పడానికి ప్రాధాన్యమిస్తున్నాయని తేలుతోందని అనరాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పురి వెల్లడించారు. హైదరాబాద్‌ జీసీసీలు సంప్రదాయ ఐటీ-ఐటీఈఎస్‌ కార్యకలాపాల పరిధిని మించి.. బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్‌సైన్సెస్, సెమీకండక్టర్లు, ఇంజినీరింగ్, ఆరోగ్య సంరక్షణతో పాటు బహుళ రంగాల పర్యావరణ వ్యవస్థగా విస్తరిస్తున్నట్లు ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర మండలి ఛైర్మన్‌ వి.వి.రామరాజు పేర్కొన్నారు. ప్రతిభావంతుల లభ్యత అధికంగా ఉండటంతో పాటు హైదరాబాద్‌లోని ఏ గ్రేడ్‌ కార్యాలయ స్థలాల అద్దె చదరపు అడుగుకు రూ.95-115గా ఉంది. ఇది బెంగళూరు కంటే తక్కువగానూ, పుణెతో పోటీపడే స్థాయిలోనూ ఉంది. ఈ సానుకూలతల వల్ల టెక్నాలజీ, ఇంజినీరింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్‌ సైన్సెస్, అనలిటిక్స్, కన్సల్టింగ్, డిజిటల్‌ ఆపరేషన్స్‌ రంగాల్లో వచ్చే ఏడాదిలోగా 50-70 అదనపు జీసీసీలు ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్రేడ్‌-ఏ కార్యాలయ స్థలం 125 మి.చ.అడుగులుగా ఉంది. ఇది మన దేశంలోని మొత్తం లభ్యతలో 15 శాతానికి సమానం. వచ్చే కొన్నేళ్లలో సుమారు 36 మి.చ.అడుగుల కొత్త కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని నివేదిక అంచనా వేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




