
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లోని ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA) యూనిట్‌కు ఐజీగా ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ నియమితులయ్యారు. ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన సంజుక్తా పరాశర్ 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఇప్పటివరకు కోబ్రా యూనిట్‌కు ఐజీగా ఉన్న 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేష్ రాణా స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అస్సాంకు చెందిన సంజుక్తా పరాశర్ తన స్వరాష్ట్రంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ సేవలందించారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పనిచేస్తూ అనేక క్లిష్టమైన ఆపరేషన్లలో పాల్గొన్న ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’ అనే పేరు వచ్చింది. సవాళ్లతో కూడిన భద్రతా పరిస్థితుల్లో విధులు నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. సంజుక్తా పరాశర్ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 85వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.





