
పెట్టుబడులకు రూ.30 వేల వరకు వినియోగించుకోవచ్చు పీఎం స్వనిధి పథకంలో వెసులుబాటు ఈనాడు, అమరావతి: రోడ్లపై తోపుడు బళ్లు, దుకాణాలు పెట్టుకుని పళ్లు, కూరగాయలు తదితర వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకూ బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు జారీ చేయనున్నాయి. వ్యాపార పెట్టుబడుల కోసం వీరు కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఈ కార్డుల ద్వారా వినియోగించుకోవచ్చు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన నగరాలతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో 6.40 లక్షల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా ప్రధాన కూడళ్లు, మార్కెట్లలో తోపుడు బళ్లపై వ్యాపారం చేస్తుంటారు. లక్షల కుటుంబాలకు ఇదే ప్రధాన జీవనాధారం. వ్యాపార పెట్టుబడుల కోసం ఇలాంటి వారంతా ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో వడ్డీ వ్యాపారుల బెడద చాలా తీవ్రంగా ఉంటోంది. చి రు వ్యాపారులకు కొత్తగా జారీ చేస్తున్న క్రెడిట్‌ కార్డులను వ్యాపార అవసరాలకే వినియోగించుకునే అవకాశం ఉంది. ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తే అలాంటి చెల్లింపులకు కార్డు అనుమతించదు. ఆ మేరకు నియంత్రణ విధించారు. 3.59 లక్షల మంది చిరు వ్యాపారుల వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లు ప్రస్తుతం ఉన్నాయి. మరో లక్ష షాపుల్లో కొత్తగా ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘లోక కల్యాణ మేళా’ రుణాలు: చిరు వ్యాపారుల్లో ఇంకా మిగిలిన మరో 1,61,481 మందికి వచ్చే నెలాఖరులోగా మరో రూ.5 కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఇప్పటివరకూ రుణాలు పొందని వ్యాపారులను గుర్తించి వారికి అక్టోబరు 1 నుంచి నెలాఖరులోగా ‘లోక కల్యాణ మేళా’ పేరుతో స్వనిధి పథకం కింద రుణాలు ఇప్పించనున్నట్లు మెప్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





