
ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రభుత్వ వలస విధానాలు న్యాయస్థానాల్లో నిలవడం లేదు. ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనలను బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల అమలును తాత్కాలికంగా అడ్డుకుంది. ఆ నిబంధనలు అమల్లోకి రావడానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది (Trump visa rules). ఈ కొత్త వీసా నిబంధనల అమలు కోసం హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్పిన కారణాలు పూర్తిగా సమర్థించేవిగా లేవని, యాభై ఏళ్లకుపైగా అమలులో ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా మార్చడం సరైన చర్య కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిబంధనలు అమలయితే.. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు తగ్గి, అమెరికా ఉన్నత విద్యారంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. అమెరికా ( USA )లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల నివాస కాలపరిమితిపై నిబంధనలను హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం జులైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జే1 వీసాలపై వచ్చే ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, ఐ-వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు నిర్దిష్ట కాలపరిమితిని విధించేలా ఆ ప్రతిపాదనలను రూపొందించింది. ఎఫ్‌1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకూ ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ కింద యూఎస్‌లో ఉంటున్నారు. ఆ నిబంధనను ఎత్తివేయాలని భావించింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. 3 లక్షల మందికిపైగా భారతీయులపై ప్రభావం పడేది. కోర్టు తీర్పుతో తాత్కాలిక ఊరట లభించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.