
బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక దంపతులు, తమకు సొంతంగా ఉన్న పిల్లలతో పాటు, వదిలేసిన పిల్లలకు తల్లిదండ్రులుగా మారడం ద్వారా ఒక గొప్ప ఉదాహరణను సృష్టించారు. వారు తమ పూ బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక దంపతులు, తమకు సొంతంగా ఉన్న పిల్లలతో పాటు, వదిలేసిన పిల్లలకు తల్లిదండ్రులుగా మారడం ద్వారా ఒక గొప్ప ఉదాహరణను సృష్టించారు. వారు తమ పూర్వీకుల ఆస్తులను అమ్మి, అవసరమైన పిల్లల చదువు మరియు భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నారు. వారి ప్రయాణం ఒక చిన్నారి శరీరమంతా చీమలతో నిండి, చెరకు తోటలో ఏడుస్తూ కనిపించడంతో మొదలైంది. ఈ దంపతులు తమకు ఉన్న కుమార్తె, కుమారుడితో పాటు ఇతర పిల్లలను కూడా ప్రేమతో పెంచుతున్నారు. సంజీవ్ కుమార్ సిన్హా, రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అనురితా కుమారితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఆరోహి కశ్యప్, పాట్నాలో వివాహం జరగడంతో ప్రస్తుతం దిల్లీలో నివసిస్తోంది. కుమారుడు శశాంక్ కుమార్ సిన్హా ఫ్యాషన్ డిజైనింగ్ చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో సంజీవ్ జీవితంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సమీపంలోని చెరకు తోటలో శరీరమంతా చీమలు పట్టి, ఓ పసిపాప ఏడుస్తూ కనిపించింది. సంజీవ్ వెంటనే పాపను అక్కడి నుంచి తీసుకువచ్చి, వైద్య పరీక్షలు చేయించి ఇంటికి తీసుకెళ్లారు. అనురితా పాపకు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. బాలల సంరక్షణ శాఖ అధికారులు పాపను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా, సంజీవ్ దంపతులు అంగీకరించలేదు. చివరకు మహిళా డీఎస్పీ కూడా ఈ దంపతుల మధ్య ఏర్పడిన అనుబంధాన్ని అర్ధం చేసుకుని, చిన్నారిని వారి వద్దే వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. పాపకు ఆకాంక్ష సిన్హా అని పేరు పెట్టారు. ఆమె ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఆమె చదువుకు ఏడాదికి రూ.45 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సంజీవ్ కుమార్, ఆకాంక్ష భవిష్యత్తులో గొప్ప రెజ్లర్‌గా మారాలని ఆశిస్తున్నారు. సంజీవ్ దంపతుల ప్రయాణం ఆకాంక్షతో ఆగిపోలేదు. ఓ రోజు ఆహారం కోసం ఏడుస్తున్న అంజు కుమారి అనే ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలికను సంజీవ్ చూసి, ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆమెకు ఇంటర్ వరకు చదువు చెప్పించి, రూ.3 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం అంజు కోల్‌కతాలో తన భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో బాలుడికి సాయంపొరుగింటి బాలుడు అభిషేక్ ప్రాణాలను కాపాడటంలోనూ ఈ దంపతులు కీలకంగా నిలిచారు. అభిషేక్‌కు 15 సంవత్సరాలు. అతడి కన్నతల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, అయినప్పటికీ అభిషేక్ ఇప్పటికీ సంజీవ్, అనురితలను తన తల్లిదండ్రులుగానే భావిస్తున్నాడు. సంజీవ్, ఇతర పిల్లలతో తేడా చూపకుండా ప్రేమతో పెంచుతున్నారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించేందుకు సంజీవ్ స్థానిక పుస్తకాల దుకాణాలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఏ పిల్లలు సంజీవ్ పేరు చెప్పి పుస్తకం అడిగితే, దుకాణదారులు వారికి ఉచితంగా పుస్తకాన్ని ఇస్తారు. సంజీవ్ ఆ పుస్తకాల మొత్తాన్ని దుకాణాదారులకు చెల్లిస్తారు. సంజీవ్ తన వద్ద ఉన్న సుమారు రూ.40 లక్షల విలువైన ఆస్తులతో పాటు పూర్వీకుల ఆస్తులను కూడా అమ్ముకున్నాడు. ప్రభుత్వ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసినప్పటికీ, అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. ఆయన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికే ఖర్చు చేస్తున్నారు. సంజీవ్ రక్తదానం కూడా చేస్తుంటారు. తన పదవీ విరమణ ప్రయోజనాలను ఉపయోగించి ఓ అనాథాశ్రమం, వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని సంజీవ్ ఆలోచిస్తున్నారు. కన్నవారిని కోల్పోయిన పిల్లలకు కుటుంబాన్ని అందిస్తూ, తనకు చేతనైనంత సాయం చేస్తున్న ఈ దంపతుల సేవా ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.