
50 కార్పొరేషన్లలో స్థానాలకు పేర్ల పరిశీలన జులైలో పదవీకాలం ముగిసిన నేతల ఒత్తిడి కొత్తవారికి, సీనియర్లకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ కసరత్తు ఈనాడు, హైదరాబాద్‌: నామినేటెడ్‌ పదవుల భర్తీకి కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. నెలాఖరుకు భర్తీ చేయాలని భావిస్తోంది. దాదాపు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులకు అర్హులైన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పేర్ల జాబితాను సీఎం రేవంత్‌రెడ్డికి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షికి పంపి ఆమోదం పొందాక అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరవాత 2024 జులైలో పలు నామినేటెడ్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. పదవీకాలం రెండేళ్లే కావడంతో ఈ ఏడాది జులైలో ముగిసింది. తరవాత మరికొందరికి పదవులు ఇచ్చింది. కొందరు పదవులు పొందిన తరవాత పార్టీ కోసం పెద్దగా కష్టపడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పీసీసీ అంతర్గత పరిశీలనలో గుర్తించినట్లు సమాచారం. అలాంటివారికి మరో దఫా అవకాశమివ్వడానికి పీసీసీ, ఏఐసీసీ సుముఖంగా లేనట్టు తాజా సమాచారం. తమకే మళ్లీ ఛాన్స్‌ ఇవ్వాలని వారు ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారినే పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జులైలో పదవీకాలం ముగిసిన వారిలో నిర్మలా జగ్గారెడ్డి, మెట్టు సాయికుమార్, పటేల్‌ రమేశ్‌రెడ్డి, శివసేనారెడ్డి, ఈరవత్రి అనిల్, బెల్లయ్య నాయక్, ప్రీతం, మల్‌రెడ్డి రాంరెడ్డి, నూతి శ్రీకాంత్‌ వంటివారికి మరోదఫా అక్కడే అవకాశం లేదా ఇతర కార్పొరేషన్‌ పదవులు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి శివసేనారెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయనకు ఈ టికెట్‌ ఇచ్చే పరిస్థితులు లేకపోతే నామినేటెడ్‌ పదవిలో మరోసారి అవకాశం ఇచ్చే సూచనలున్నాయి. కొత్తగా కొందరికి తొలిసారి పదవులు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నామినేటెడ్‌ పదవుల భర్తీకి సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఐసీసీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వమే కులగణన చేసినందున గతంలో పదవులు దక్కని, ప్రాతినిధ్యం పెద్దగా లేని కులాల నేతలను ఈసారి గుర్తించనున్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినందున ఎక్కువ జనాభా ఉన్న తమకు అదే కోటాలో పదవులు ఇవ్వాలని మాదిగ సామాజికవర్గం నేతలు పీసీసీకి విన్నవిస్తున్నారు. పెరిక శ్యాం, వక్కలగడ్డ చంద్రశేఖర్‌ వంటివారు తాజాగా విన్నవించారు. పార్టీ కోసం కష్టపడినవారిని మండల, జిల్లా స్థాయుల్లో గుర్తించి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల నుంచి నివేదికలు తెప్పించామని, వారిలో సీనియర్లకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని పీసీసీ వర్గాలు తెలిపాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





