
CITU | మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 16న మెదక్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం తెలిపారు. మెదక్ జిల్లాలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా సమగ్రంగా చర్చ జరగలేదని విమర్శించారు. తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు వెళ్తున్న ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం, కేసులు నమోదు చేయడం, మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జి చేయడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చించకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న ఉదయం 10 గంటలకు మెదక్ పోస్టాఫీస్ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పరిశ్రమల కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. సంతోష్ పాల్గొన్నారు.




